Revanth Reddy | ప్రపంచ నగరాలకు పోటీగా ఫ్యూచర్ సిటీ..
Revanth Reddy | ప్రపంచ నగరాలకు పోటీగా ఫ్యూచర్ సిటీ..
- అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు..
ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్‌సీడీఏ లోగో, వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు.
సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత రాష్ట్ర రాజధానిలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ అవతరించబోతోందన్నారు. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ నగర నిర్మాణం పూర్తవుతుందని, ఫ్యూచర్ సిటీ న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
కేవలం 150 రోజుల్లో ఎఫ్‌సీడీఏ భవనాన్ని పూర్తి చేశామని పేర్కొన్న సీఎం.. హైదరాబాద్ భౌగోళిక విస్తరణతో పాటు ఉపాధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు. అభివృద్ధి కారణంగా రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ బంగారం ధరలను మించిపోయే స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి.. “నిన్న రెండు గంటల వానకే హైదరాబాద్‌లో నీరు నిలిచిపోయింది. అంతర్జాతీయ నగరం అని చెప్పుకోవడం సరిపోదు. రోడ్లపై వరదలు పారితే దానికి బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నించారు. అక్రమ కబ్జాలు, ప్రణాళికా రహిత అభివృద్ధే ప్రస్తుత వరద సమస్యలకు కారణమని ఆరోపించారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం.. “ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే నగరాన్ని రద్దు చేస్తామంటే ప్రజలే సమాధానం చెబుతారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
