Achampet కెమెరా ట్రాప్‌లో చిక్కిన వేటగాళ్లు

Achampet కెమెరా ట్రాప్‌లో చిక్కిన వేటగాళ్లు

  • నాటు తుపాకి, మందుగుండ్లతో అడవిలో సంచారం.. నలుగురిపై కేసులు

అచ్చంపేట (Achampet), ఆంధ్రప్రభ

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ వేటగాళ్ల కదలికలను అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది. అచ్చంపేట రేంజ్ పరిధిలోని అల్లంగట్టు అటవీ ప్రాంతంలో నాటు తుపాకి, మందుగుండ్లు, గొడ్డలి తదితర సామగ్రితో సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు కెమెరా ట్రాప్‌లలో నమోదయ్యారు.

ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.

ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో గత నెల 18న ఈ దృశ్యాలు నమోదయ్యాయి. సుమారు 30 ఫొటోలను విశ్లేషించిన అటవీ అధికారులు చతుర్భావి తండా, చందాపూర్, లింగోటం గ్రామాలకు చెందిన నలుగురిని గుర్తించినట్లు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో వారు వేట ఉద్దేశంతో అడవిలోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులు నివసిస్తున్నందున ఆయుధాలతో అడవిలో సంచరించడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.

ప్రస్తుతం నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

అటవీ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్ల ద్వారా నిఘాను మరింత పెంచినట్లు తెలిపారు. అక్రమ వేట, చొరబాట్లను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర సూచించారు.

Leave a Reply