నిస్వార్ధ సేవకు ప్రతిరూపం
నిస్వార్ధ సేవకు ప్రతిరూపం
స్మృతివనంలో విగ్రహావిష్కరణ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : గాంధీజీ బాటలో తన జీవన పర్యంతం నడుస్తూ అటు స్వాతంత్ర సమరయోథునిగా, ఇటు ప్రజా ప్రతినిధిగా వావిలాల గోపాలకృష్ణయ్య కీర్తిగాంచారని వక్తలు కొనియాడారు. ఆంధ్రా గాంధీగా నిస్వార్ధసేవలందించిన మహనీయుడు వావిలాల అని తెలిపారు . స్థానిక గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోథుల స్మృతివనంలో వావిలాల గోపాలకృష్ణయ్య నూతన విగ్రహాన్ని విశ్రాంత మెప్మా పీడీ సి.హెచ్.వెంకటరావు, రిటైర్డ్ సీఈవో సురంగి మోహన్రావు, విగ్రహ సమర్పకులు కొమ్ము రమణమూర్తి కుటుంబం సంయుక్తంగా బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత దేశ సేవ కోసం ఆజన్మాంతం బ్రహ్మచారీగా నిలిచిన గొప్ప వ్యక్తిగా వావిలాల నిలిచారన్నారు. మద్యపాన నిషేద ఉద్యమంతో పాటు ఎన్నో సంస్కరణలకు కృషి చేసిన వావిలాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన వావిలాల నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులుతో సన్నిహిత సంబంధాలు కలిగిన గోపాలకృష్ణయ్య జీవితాంతం గాంధీజీ చిత్రంతో కూడిన సంచిలో రెండు జతల బట్టలు ఉంచుకొని ఎక్కడ ఉద్యమం, ప్రజా సమస్య ఉన్నా ముందుండి పోరాడేవారన్నారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వగా ఆంధ్రా యూనివర్శిటీ కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చి సత్కరించిందన్నారు. ఆంధ్రా గాంధీగా, ఆజాత శత్రువుగా వావిలాల జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.
అనంతరం విగ్రహ దాత కొమ్ము రమణమూర్తిని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు జామి భీమశంకర్, బరాటం లక్ష్మణరావు, మహిబుల్లాఖాన్, పొన్నాడ రవికుమార్, పైడి హరనాధరావు, నిష్టల నరసింహమమూర్తి, నక్క శంకరరావు, మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు, పెంకి చైతన్యకుమార్, చౌదరి రాధాకృష్ణ, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, గేదెల ఇందిరాప్రసాద్, గేదెల లక్ష్మీ, తర్లాడ అప్పలనాయుడు, వాన కృష్ణచంద్, ఆకుల హరినారాయణ, డోల మురళీకృష్ణ, యవ్వారి అప్పన్న, కొమ్ము నిఖిల్ సాయిశ్రీనివాస్, కొమ్ము వాగ్దేష్ సాయిశ్రీనివాస్, శాస్త్రి తదితరులున్నారు.
