ఘనంగా సురక్షిత మాతృత్వ దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా సురక్షిత మాతృత్వ దశాబ్ది ఉత్సవాలు

మరిపెడ, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్” విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ప్రస్థాన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. వైద్యాధికారులు డాక్టర్ రవి, డాక్టర్ పూజిత గర్భిణీలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.

రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ శాతం వంటి ఉచిత ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఉచిత మందులు, ఐరన్, కాల్షియం టాబ్లెట్లు పంపిణీ చేశారు. కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు అందించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో సమతుల్య పోషకాహారం, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాతా-శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో 102 ఉచిత అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మి కుమారి, ఏఎన్‌ఎం అశ్విని, ఆశా కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.