ఎన్నాళ్ళు… ఎదురు చూపులు..

10 ఏళ్లుగా కొనుగోలు ప్రారంభం కాని దుర్గి మిర్చి యార్డు
పండేది పల్నాడులో… లాభాలు పోయేది గుంటూరుకు!
రైతు జేబుకు వేల రూపాయల భారం…
యార్డు మాత్రం అలంకార ప్రాయం

గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశంలోనే అత్యధికంగా మిర్చి పండించే పల్నాడు రైతు నేటికీ తన పంటను అమ్ముకోవడానికి వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల కష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో దుర్గిలో మిర్చి యార్డు నిర్మించినా, అది నేటికీ రైతులకు అందని ద్రాక్షగానే మిగిలింది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన యార్డులో ఇప్పటి వరకు ఒక్క మిర్చి బస్తా కూడా కొనుగోలు కాకపోవడం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

భూమిపూజలు ఘనంగా… కొనుగోళ్లు శూన్యం!

2005లో ప్రతిపాదన, 2010లో భూమిపూజ, 2017లో నిర్మాణాలు పూర్తి… కానీ 2026కు చేరినా దుర్గి మిర్చి యార్డులో వ్యాపార లావాదేవీలు మాత్రం ప్రారంభం కాలేదు. రైతుల కోసం ఏర్పాటు చేసిన యార్డు చివరకు ఇసుక డంపింగ్ యార్డుగా మారడం మరింత విమర్శలకు తావిస్తోంది.

పండేది పల్నాడులో… లాభం గుంటూరుకు!

ప్రతి ఏడాది పల్నాడు జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా మిర్చి సాగవుతోంది. మాచర్ల, గురజాల, వినుకొండ ప్రాంతాల రైతులే గుంటూరు మిర్చి యార్డుకు ప్రధాన సరఫరాదారులు. కానీ పంటను అక్కడికి తరలించేందుకు లారీ బాడుగలు, ఎత్తుడు-దింపుడు కూలీలు, బస ఖర్చులు, కాపలా ఖర్చులు కలిపి రైతులపై భారీ భారం పడుతోంది. పంట అమ్మకానికి వెళ్లిన రైతు లాభం కన్నా ఖర్చులే ఎక్కువవుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.

రాజకీయ గ్రహణమేనా…

దుర్గి యార్డు అందుబాటులోకి వస్తే గుంటూరులోని కొన్ని కోల్డ్ స్టోరేజీలు, కమిషన్ వ్యాపారుల వ్యాపార ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందనే కారణంతోనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్న ఆరోపణలు రైతు వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. భూములు, నిధులకు కోతలు విధించడం వెనుక కూడా రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయనే చర్చ సాగుతోంది.

20 ఎకరాల యార్డు… వేల ఆశలు

ప్రస్తుతం సిద్ధంగా ఉన్న దుర్గి యార్డును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తే మాచర్ల, గురజాల, వినుకొండ ప్రాంతాల 50 వేల ఎకరాల మిర్చి రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల రైతులకు కూడా ఇది వరంగా మారుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని కమిషన్ వ్యాపారులను అనుసంధానం చేస్తే యార్డు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.మిర్చి రైతు చెమటతో నిలిచిన పల్నాడులో… దుర్గి యార్డు ఎప్పుడు మేల్కొంటుందో అని అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ప్రత్యేక దృష్టి సారించాలి..
–యాగంటి

“దుర్గి మిర్చి యార్డు పూర్తిస్థాయిలో పనిచేస్తే పల్నాడు రైతుల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయి. రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి” అని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు.

దుర్గి యార్డు… కొన్ని వాస్తవాలు
ప్రతిపాదన : 2005
భూమిపూజ : 2010
నిర్మాణాలు పూర్తి : 2017
మొదటి ప్రతిపాదన : 90 ఎకరాలు, రూ.16 కోట్లు
అమలు : 20 ఎకరాలు, రూ.4.05 కోట్లు
ఇప్పటి వరకు కొనుగోలు : సున్నా బస్తాలు
పల్నాడులో మిర్చి సాగు : 1.14 లక్షల ఎకరాలు
గుంటూరుకు రైతుల ప్రయాణం : 100-120 కి.మీ.