AP Biodiversity Parks | జీవవైవిధ్య సంరక్షణకు ఏపీ కార్యాచరణ..

AP Biodiversity Parks | జీవవైవిధ్య సంరక్షణకు ఏపీ కార్యాచరణ..

AP Biodiversity Parks | జీవవైవిధ్య పరిరక్షణకు రాష్ట్ర బోర్డు సమగ్ర ప్రణాళిక

మంగళగిరి, తిరుపతిలో కొత్త జీవవైవిధ్య పార్కులు

సెప్టెంబరులో కడప బయోడైవర్సిటీ పార్కు ప్రారంభం

AP Biodiversity Parks | అమరావతి, ఆంధ్రప్రభ : అభివృద్ధి పరుగులు తీస్తున్న కొద్దీ ప్రకృతి గల జీవవైవిధ్యం పరిరక్షణ మరింత కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీ ఎసిబి) రాష్ట్రంలో పర్యావరణ సంరక్షణకు శ్రీకారం చుట్టింది. మంగళగిరి, తిరుపతిలో కొత్త జీవవైవిధ్య పార్కుల ఏర్పాటు, కడపలో నిర్మాణంలో ఉన్న బయోడైవర్సిటీ పార్కు తొలి దశను సెప్టెంబరులో ప్రారంభించేందుకు సన్నాహాలు, పట్టణ ప్రాంతాల్లో మైక్రో ఫారెస్టుల అభివృద్ధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సమీకరించేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు బోర్డు తీసుకుంది.

భూమిపై జీవరాశుల మనుగడకు జీవవైవిధ్యం పునాది. వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మజీవులు, సముద్ర జీవులు కలిసి ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. అయితే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నరికివేత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో జీవవైవిధ్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య పరిరక్షణను అభివృద్ధి ప్రణాళికల్లో భాగం చేయాల్సిన అవసరం పెరిగింది.

ఈ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు, జీవవైవిధ్యాన్ని కేవలం అటవీ ప్రాంతాలకే పరిమితం చేయకుండా పట్టణాలు, గ్రామాలు, తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాల వరకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

మంగళగిరిలో కొత్త కేంద్రం

రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మంగళగిరిలో జీవవైవిధ్య పార్కు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. వేలాది ఎకరాల్లో నిర్మాణాలు, రహదారులు, నివాస సముదాయాలు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రత్యేక హరిత మండలాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిపాదిత పార్కులో స్థానిక వృక్షజాలం, ఔషధ మొక్కలు, సీతాకోకచిలుకల ఉద్యానవనం, పక్షుల సంరక్షణ విభాగం, ప్రకృతి విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులకు ఇది ఆకర్షణీయ కేంద్రంగా మారనుంది.

ప్రకృతి-ఆధ్యాత్మికత కలయిక

దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతి ఇప్పటికే శేషాచలం జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉంది. ఇక్కడ కొత్త బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటుతో ప్రకృతి, పర్యాటకం, పర్యావరణ విద్య ఒకే వేదికపైకి రానున్నాయి. శేషాచలం కొండల పరిసర ప్రాంతాల్లో కనిపించే అరుదైన వృక్షజాలం, జంతుజాలం, ఔషధ సంపదను పరిరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఇది ఉపయోగపడనుంది.

కడప బయోడైవర్సిటీ పార్కు సిద్ధం

రాయలసీమ ప్రాంతంలో జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతీకగా రూపుదిద్దుకుంటున్న కడప బయోడైవర్సిటీ పార్కు తొలి దశ పనులు పూర్తికి చేరువయ్యాయి. సెప్టెంబరులో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పార్కులో స్థానిక వృక్షజాతుల ప్రదర్శన, పక్షుల నివాస ప్రాంతాలు, జల వనరుల ఆధారిత పర్యావరణ వ్యవస్థలు, ప్రకృతి విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో పరిశోధనా కార్యకలాపాలకు కూడా ఇది వేదిక కానుంది.

నగరాల్లో మైక్రో ఫారెస్టులు

పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాయు కాలుష్యం తీవ్రతరం కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. దీనికి పరిష్కారంగా ఏపీఎస్ బీబీ మైక్రో ఫారెస్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

చిన్న స్థలంలోనే అధిక సాంద్రతతో మొక్కలను నాటి అటవీ వాతావరణాన్ని సృష్టించే మియావాకి విధానం అనుసరించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయడంతో పాటు ఉష్ణోగ్రతలను తగ్గించడం, పక్షులకు ఆశ్రయం కల్పించడం, వర్షపాతం చక్రానికి తోడ్పడడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి.

నిధుల సమీకరణకు ప్రయత్నాలు

జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు అవసరం అవుతుంటాయి. ప్రభుత్వం తోడ్పాటుతోపాటు కార్పొరేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని బయోడైవర్సిటీ బోర్డు భావిస్తోంది. దీనికోసం కంపెనీల చట్టంలోని సెక్షన్-8 కింద ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ సంస్థ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను సమీకరించి జీవవైవిధ్య పార్కులు, అటవీ పునరుద్ధరణ, తీర ప్రాంత పరిరక్షణ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

తూర్పు కనుమలు, సముద్ర జీవవైవిధ్యంపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు జీవవైవిధ్యానికి నిలయం. అనేక అరుదైన వృక్షజాతులు, ఔషధ మొక్కలు, అంతరించిపోతున్న జీవజాతులు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయ సంస్థల సహకారంతో తూర్పు కనుమల ఫ్లోరా వైవిధ్యంపై విస్తృత అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

ప్రజల భాగస్వామ్యం కీలకం

జీవవైవిధ్య పరిరక్షణలో ప్రజల పాత్ర అత్యంత కీలకం అని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు, గ్రామ జీవవైవిధ్య నిర్వహణ కమిటీల బలోపేతం, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.

పాఠశాలలు, కళాశాలల్లో జీవవైవిధ్య క్లబ్బులు ఏర్పాటు చేయడం, ప్రకృతి యాత్రలు నిర్వహించడం, స్థానిక జీవజాతులపై సమాచార సేకరణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యువతలో పర్యావరణ చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.


Leave a Reply