AI Data Centers | నీరు, భూమిపై తీవ్ర ప్రభావం

AI Data Centers | నీరు, భూమిపై తీవ్ర ప్రభావం

AI Data Centers | 2030 నాటికి భారీగా పెరగనున్న విద్యుత్ వినియోగం
ఏఐ మౌలిక సదుపాయాల్లో ప్రపంచ అసమతుల్యత

AI Data Centers | న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో డేటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో ఇవి వస్తున్నాయి. డేటా సెంటర్లు భారీగా విద్యుత్‌ను, నీటిని వినియోగిస్తాయని తాజాగా విడుదలైన ఒక నివేదిక తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలు, దైనందిన జీవితాన్ని పునర్నిర్మిస్తున్నప్పటికీ, దాని పర్యావరణ ప్రభావం మాత్రం భారీ స్థాయిలో ఉంటుందని ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్ నివేదిక స్పష్టం చేసింది.

2030 నాటికి ఏఐకి శక్తినిచ్చే డేటా సెంటర్లు 945 టెరావాట్ అవర్ (టీడబ్ల్యూహెచ్) విద్యుత్‌ను వినియోగిస్తాయని, 9.3 లక్షల కోట్ల లీటర్ల నీరు (సుమారు 328.4 టీఎంసీలు) అవసరం అవుతుందని నివేదిక పేర్కొంది. ఈ డేటా సెంటర్లకు 14,500 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూమి అవసరం అవుతుందని, ఏటా 2.5 మిలియన్ టన్నుల వరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయని అంచనా వేసింది.

ఈ డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ డిమాండ్ ఒక్కటే 65 కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల మొత్తం విద్యుత్ వినియోగానికి మూడు రెట్లు ఉంటుందని తెలిపింది. ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం ప్రపంచ విద్యుత్ వినియోగంలో ఇది 3 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.

డేటా సెంటర్ల నీటి వినియోగం కూడా దిగ్భ్రాంతికరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. నివేదిక అంచనా ప్రకారం, డేటా సెంటర్లు సబ్-సహారా ఆఫ్రికాలోని 130 కోట్ల మంది ప్రజల ప్రాథమిక వార్షిక గృహ అవసరాలను తీర్చడానికి అవసరమైనంత నీటిని వినియోగిస్తాయి. డేటా సెంటర్ల కోసం వినియోగించే భూమి 3.2 కోట్ల మందికి పైగా నివసిస్తున్న జకర్తా మహానగర ప్రాంతం కంటే రెండింతలకు పైగా ఉంటుందని తెలిపింది.

జనరేటివ్ ఏఐ అప్లికేషన్లను వేగంగా స్వీకరించడంతో కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్నాలజీ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు పోటీ పడుతున్నాయి. 2025లో ప్రపంచ డేటా సెంటర్లు సుమారు 448 టెరావాట్ అవర్ విద్యుత్‌ను వినియోగించినట్లు నివేదిక పేర్కొంది. వీటిని ఒక దేశంగా పరిగణిస్తే, ప్రపంచంలో 11వ అతిపెద్ద విద్యుత్ వినియోగదారుగా నిలుస్తాయి. కేవలం ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.

ఏఐ వల్ల కలిగే పర్యావరణ ప్రభావంపై ఈ నివేదిక ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. ఏఐని రోజువారీ వాడకం వల్ల ఎక్కువగా పర్యావరణ భారం పడుతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం, ప్రస్తుతం ఏఐని 80-90 శాతం ఇన్సూరెన్స్ రంగం వినియోగిస్తోంది. ఒక్క చాట్‌జీపీటీనే రోజుకు సుమారు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లను ప్రాసెస్ చేస్తుందని అంచనా. దీని వల్ల ఒకే ఉత్పత్తికి సంవత్సరానికి 383 గిగావాట్ అవర్ విద్యుత్ వినియోగం అవుతుంది.

నివేదిక ప్రకారం, దీని వల్ల వెలువడే ఉద్గారాలను భర్తీ చేయడానికి 2.6 మిలియన్ల మొక్కలను 10 సంవత్సరాల పాటు పెంచాల్సి ఉంటుంది. ఈ చెట్లు మాన్‌హాటన్‌కు సమానమైన విస్తీర్ణాన్ని కవర్ చేయడానికి సరిపోతాయి. ఏఐ రూపొందించిన కంటెంట్‌తో ఇంధన వినియోగం వేగంగా పెరుగుతోందని కూడా నివేదిక స్పష్టం చేసింది.

సాధారణ ఏఐ రూపొందించిన చిత్రం ఒక ప్రాథమిక టెక్స్ట్ వర్గీకరణ పని కంటే సుమారు 1,450 రెట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. అదే సమయంలో చిన్న ఏఐ రూపొందించిన వీడియో 2 లక్షల స్పామ్ వర్గీకరణలకు సరిపడా విద్యుత్‌ను వినియోగించగలదు. కార్బన్ ఉద్గారాల కంటే ఏఐ, డేటా సెంటర్లు నీటికి, భూమికి ఎంత హానికరంగా పరిణమిస్తాయో చూసి చాలా ఆశ్చర్యపోయినట్లు నివేదిక రూపకర్తల్లో ఒకరైన డాక్టర్ మిరియం అక్టల్ చెప్పారు.

కేవలం సామర్థ్య పెంపుదల మాత్రమే సమస్యను పరిష్కరించలేదని, ఏఐ వ్యవస్థలు చౌకగా, మరింత సమర్థవంతంగా మారే కొద్దీ వీటి మొత్తం వినియోగం వేగంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. విద్యుత్, నీటి వినియోగానికి అతీతంగా మౌలిక సదుపాయాల్లో పెరుగుతున్న ప్రపంచ అసమతుల్యతను కూడా నివేదిక ఎత్తిచూపింది.

ఏఐ ప్రత్యేక కంప్యూటింగ్ సామర్థ్యంలో 90 శాతం కంటే ఎక్కువ అమెరికా, చైనాల్లోనే కేంద్రీకృతమై ఉందని, కేవలం 32 దేశాలు మాత్రమే ఏఐ ప్రత్యేక డేటా సెంటర్లను కలిగి ఉన్నాయని తెలిపింది. 150 కంటే ఎక్కువ దేశాలకు సార్వభౌమ ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం చాలా తక్కువగా లేదా అసలే లేదని నివేదిక ఎత్తిచూపింది.

తమ నివేదిక ఏఐకి వ్యతిరేకం కాదని ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ కావే మదానీ స్పష్టం చేశారు. ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, దాని దుష్ప్రభావాలను ముందుగానే పరిష్కరించాలని ఈ నివేదిక పిలుపు ఇస్తోందన్నారు. తగిన ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకోకుంటే పర్యావరణ ప్రభావం ప్రపంచంలోని అతిపెద్ద సమస్యగా మారుతుందని నివేదిక స్పష్టం చేసింది.

Leave a Reply