బడిబాటతో ప్రభుత్వ పాఠశాలల ప్రచారం..

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలో ఉన్న ప్రతి బడి ఈడు చిన్నారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలంలోని నైన్‌పాక గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

శనివారం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో గ్రామ సర్పంచ్ నక్క భాస్కర్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. ఊర్మిళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాముకుంట్ల తిరుపతయ్య బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 21 వస్తువులతో కూడిన కిట్‌తో పాటు అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, బోధన ప్రమాణాలను తల్లిదండ్రులు పరిశీలించి తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డి రాములు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కె. ప్రవీణ్‌కుమార్, ప్రసాద్, సీఆర్పీ తిరుపతి, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply