Delhi Fire Accident | కుక్ నిర్లక్ష్యమే 21 మంది మృతికి కారణమా?..

Delhi Fire Accident | కుక్ నిర్లక్ష్యమే 21 మంది మృతికి కారణమా?..

దర్యాప్తులో కీలక విషయాలు

Delhi Fire Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశ రాజధాని దిల్లీలోని స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 21మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, హోటల్‌లో పనిచేస్తున్న కుక్ కేశవ్ నేగిని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆయన నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఘటన జరిగిన రోజు వంటగదిలో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే పేలుడు సంభవించిందని కేశవ్ నేగి మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. అనంతరం హోటల్ మెయిన్ పవర్‌ను ఆఫ్ చేసి తన ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగెత్తినట్లు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల హోటల్‌లోని ఎలక్ట్రానిక్ తలుపులు పనిచేయకుండా లాక్ అయ్యాయని దర్యాప్తులో తేలినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

విద్యుత్ నిలిచిపోవడంతో పలువురు అతిథులు గదుల్లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బాత్రూమ్ తలుపులు తెరుచుకోకపోవడం వల్ల ఓ విదేశీ జంట పొగలో చిక్కుకుని ఊపిరాడక మరణించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కుక్‌తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హోటల్ నిర్వహణలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. కిటికీలు, గాజు ప్యానెల్స్ పూర్తిగా మూసివేయడంతో పొగ బయటకు వెళ్లకుండా భవనం అంతటా వ్యాపించింది. దీంతో అక్కడ ఉన్నవారికి బయటపడే అవకాశం లేకుండా పోయింది. పొగ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

బేస్‌మెంట్ ప్రవేశ మార్గానికి కూడా తాళం వేయబడి ఉండటంతో సహాయక సిబ్బంది లోపలికి చేరుకోవడంలో ఆలస్యం జరిగిందని వెల్లడైంది. దాదాపు 10 నిమిషాల తర్వాత బేస్‌మెంట్‌లోకి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి హోటల్ యజమాని లవ్‌కేశ్ బజాజ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకపోయిన విషయాన్ని విచారణలో ఆయన అంగీకరించినట్లు సమాచారం.

Leave a Reply