Polymer Notes | ఇకపై ప్లాస్టిక్ నోట్లు?!
Polymer Notes | ఇకపై ప్లాస్టిక్ నోట్లు?!
మీరు విన్నది నిజమే.. ఆర్బీఐ కొత్త ఆలోచన!
Polymer Notes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారతీయ కరెన్సీ ముఖచిత్రం మారబోతోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలీమర్ (ప్లాస్టిక్) నోట్లను తీసుకురావాలనే ప్రతిపాదనను భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా పరిశీలిస్తోంది.
తాజాగా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ప్రక్రియ ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉందని, కొత్త నోట్ల వల్ల కలిగే లాభనష్టాలు, వ్యయ ప్రయోజనాలు అలాగే అమలు సాధ్యతపై ఆర్బీఐ లోతైన అంచనా వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
అసలేందుకు ఈ ప్రతిపాదన..
దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం ప్రతి ఏటా పెరుగుతుండటం, ఎక్కువ మొత్తంలో పాతబడిన నోట్లను ప్రతి ఏటా చలామణి నుంచి తొలగించాల్సి రావడం ఈ కొత్త ఆలోచనకు ప్రధాన కారణాలు. పాలీమర్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయని, ఇవి ధూళి, తేమ ,చిరగడం వంటి సమస్యలకు వ్యతిరేకంగా మరింత నిరోధకతను కలిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వీటిలో అధునాతన భద్రతా ఫీచర్లను పొందుపరచడం ద్వారా నకిలీ నోట్ల ముప్పును కూడా తగ్గించవచ్చని ఆర్బీఐ భావిస్తోంది.
పైలట్ ప్రాజెక్ట్ గురించి ప్రచారం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఆర్బీఐ తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10 అలాగే రూ.20 వంటి తక్కువ విలువ కలిగిన నోట్లను పాలీమర్ రూపంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదా పైలట్ ప్రాజెక్ట్ ఖరారు కాలేదని, ఇది కేవలం పరిశీలనలో ఉన్న అంశం మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
