అమరావతిపై రాజకీయాలు మానాలి..

అమరావతిపై రాజకీయాలు మానాలి..

  • ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు.

తిరువూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరువూరులోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్లిందని, ఆ నిర్ణయానికే రాష్ట్ర ప్రజలు ఘన విజయం ద్వారా మద్దతు తెలిపారని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం, విశాఖపట్నం, రాయలసీమ అభివృద్ధి వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తుంటే, ప్రతిపక్ష నేత . జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాజధాని అంశంపై వివాదాలు సృష్టించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి బలమైన రాజధాని అవసరమని, రాజధాని అభివృద్ధి చెందితేనే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి సహకరించాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు.

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన సూచనలు, అభిప్రాయాలు స్వాగతమేనని, అయితే రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగించే రాజకీయాలను ప్రజలు అంగీకరించరని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply