ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు పలు రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రారంభించారు.
బందాల గ్రామంలో బొల్లెపల్లి నుంచి పోచాపూర్ వరకు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే పోదాపూర్ గ్రామం నుంచి అల్లిగూడెం మీదుగా నర్సాపూర్ వరకు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ రహదారుల నిర్మాణంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, డీఎఫ్వో వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
