ప్రజా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలి

ప్రజా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలి

పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదు: కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించాలని, వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 7 నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం, జలాధార–జలహారతి, యోగాంధ్ర, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్‌కు వచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారంపై అలసత్వం కారణంగానే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్‌కు వినతులు అధిక సంఖ్యలో వస్తున్నాయని అన్నారు.

ఏప్రిల్ 6 నుంచి జూన్ 1 వరకు తొమ్మిది వారాల పాటు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మండల స్థాయిలో ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడం శోచనీయమని కలెక్టర్ వ్యాఖ్యానించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

జలాధార–జలహారతి కార్యక్రమంపై మాట్లాడుతూ.. డ్వామా, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉపయోగపడేలా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను శుక్రవారం లోపు పూర్తి చేయాలని సూచించారు.

గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జల మట్టం కొంత తగ్గిందని, నీటి సంరక్షణ పనుల ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. మండల స్థాయిలో ఏపీఓలు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ ఏఈలు సమన్వయ సమావేశాలు నిర్వహించి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జలాధార–జలహారతి పథకం కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

‘ఏక్ పెడ్ మా కె నామ్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గృహాల వద్ద అనుకూలమైన మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తరగతి గదులు, విశ్రాంతి గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలని, వంటశాలలకు అవసరమైన సామగ్రి, వంటగ్యాస్‌ను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జూన్ 7 నుంచి 20 వరకు రెండు వారాల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు.

యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జూన్ 7న ఎస్వీ జూపార్క్‌లో, జూన్ 12న చంద్రగిరి కోటలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మాస్టర్ ట్రైనర్లు, పీటీ ట్రైనర్ల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టూరిజం, విద్యాశాఖ, సంక్షేమ వసతి గృహాల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, యోగా అభ్యాసకులను భాగస్వామ్యం చేసి యోగాంధ్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, డ్వామా ఏపీడీలు, ఏపీఓలు, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply