‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలకు సిద్ధం
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలకు సిద్ధం
పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గురువారం నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలతో పాటు పట్టణంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
బుధవారం సాయంత్రం చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో రూపొందించిన పోస్టర్, బుక్లెట్ను విడదల రజిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తాను యడ్లపాడు మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. అలాగే ఈ నెల 8న మహిళలు, యువత, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక సదస్సు, 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు.
