గడువులోగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి
గడువులోగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఇంటింటి సర్వేతో ఓటరు జాబితాల ప్రక్షాళనకు చర్యలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా గడువులోగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని చెప్పారు. ఓటరు జాబితాల నాణ్యతను మెరుగుపరిచేలా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా వివరాలను కచ్చితంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. డూప్లికేట్ నమోదుల గుర్తింపు, చిరునామా మార్పులు, కొత్త చేర్పులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
