కోమటిరెడ్డికి తలసాని సవాల్
చట్టం తెస్తే రాజీనామాకు సిద్ధం
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే, ఆంధ్రా వాళ్లకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వమని.. అవసరమైతే దానికి సంబంధించి చట్టం కూడా తీసుకొస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని తలసాని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన తలసాని.. కోమటిరెడ్డి నిజంగా అలాంటి చట్టం తీసుకురావాలనుకుంటే ముందుగా తన ముఖ్యమంత్రిని ఒప్పించాలని సవాల్ విసిరారు. “నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తీసుకొస్తే.. నేను రాజీనామా చేయడానికి సిద్ధం” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడే ప్రతి మాట ప్రజలపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ఆలోచించి మాట్లాడాలని తలసాని సూచించారు.
కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తలసాని విసిరిన ఈ సవాల్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీస్తోంది.
