అచ్చంపేటలో అమానుషం
అచ్చంపేటలో అమానుషం
పొదల్లో నవజాత శిశువు మృతదేహం
కుక్కలు పీక్కుతిన్న దారుణ దృశ్యం – స్థానికుల్లో ఆగ్రహం
ప్రైవేట్ ఆసుపత్రుల వ్యర్థాల పారవేతపై అనుమానాలు..
పోలీసులు దర్యాప్తు వేగవంతం
గతంలోనూ నవజాత శిశువు చెరువులో లభ్యం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే జన్మించిన ఓ నవజాత ఆడశిశువు మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో పడేయడంతో, కుక్కలు దానిని పీక్కుతిన్న దారుణ సంఘటన బుధవారం ఉదయం స్థానికులను కలచివేసింది. స్థానికుల వివరాల ప్రకారం అచ్చంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గౌతమి స్కూల్ వెనుక భాగంలోని కంపచెట్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. ఒకటి లేదా రెండు రోజుల క్రితం ఏదో ఆసుపత్రిలో జన్మించిన ఆడశిశువును అక్కడ పడేయగా, కుక్కలు ముఖ భాగాన్ని పూర్తిగా పీక్కుతిన్నట్లు గుర్తించారు.
మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది?
శిశువు మృతదేహాన్ని కుక్కలే పొదల నుంచి లాగి కాలనీలోకి తీసుకొచ్చాయా..? లేక ఎవరైనా వ్యక్తులు అక్కడ పడేశారా..? అనే అంశాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల పాత్ర ఉండొచ్చని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
పోలీసులకు సమాచారం.. ఆసుపత్రికి తరలింపు
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ఉదయం సుమారు 7.30 గంటలకు పోలీసులు మృతదేహాన్ని తీసుకురాగా, మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.
వ్యర్థాల పారవేతపై స్థానికుల ఆరోపణలు
విద్యానగర్ కాలనీ వాసుల కథనం ప్రకారం ప్రతిరోజూ రాత్రి వేళల్లో కొన్ని ఆసుపత్రులకు చెందిన వ్యర్థాలను పెద్ద ప్లాస్టిక్ డబ్బాల్లో తీసుకొచ్చి కాలనీ పరిసరాల్లో పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు కూడా అలాంటి చర్యలతో సంబంధం ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం
ఘటనపై అచ్చంపేట ఎస్సై సద్దాం తన సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. శిశువు ఎక్కడ జన్మించింది, మృతదేహాన్ని ఎవరు అక్కడ పడేశారు, ఆసుపత్రుల వ్యర్థాల పారవేతతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాదకర ఘటన అచ్చంపేట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
గతములోను నవజాత శిశువు మృతదేహం చెరువులో లభ్యం
కాగా అచ్చంపేట పట్టణంలో గత కొన్ని నెలల క్రితం ఒక నవజాత శిశువు మృతదేహం స్థానిక మల్లంకుంట చెరువులో లభ్యం కాగా పట్టణంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఈ దారుణానికి వడిగట్టారనే వదంతులు అప్పట్లో వ్యాపించాయి.
