ప్రాజెక్టుల పూర్తి రేవంత్‌తోనే సాధ్యం

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్, జూన్ 3 (ఆంధ్రప్రభ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు సహా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పూర్తిచేసే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లా డీసీసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. పాలమూరు ఎంపీగా గెలిచి, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రాజెక్టు పూర్తిచేస్తానని హామీలు ఇచ్చి ఆర్భాటాలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. లక్ష కోట్ల వ్యయంతో పూర్తయ్యే పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి పూర్తి చేశామంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

పెండింగ్ పనులను పూర్తి చేసి 90 టీఎంసీల నికర జలాలను జిల్లాకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, అలంపూర్ తదితర ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్‌లో పర్యటించి జూరాల ప్రాజెక్టును సందర్శిస్తారని, 5న నార్లాపూర్, వట్టెం, కరివెన ప్రాంతాల్లో పర్యటించి ఉదండాపూర్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ప్రజలు భారీగా తరలిరావాలని, పాలమూరు నియోజకవర్గం నుంచి 25 వేల మంది హాజరుకావాలని జూపల్లి పిలుపునిచ్చారు.

Leave a Reply