తిరుమల తరహాలో సౌకర్యాలు..

తిరుమల తరహాలో సౌకర్యాలు..

శ్రీశైలం అభివృద్ధికి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు

యోగాంధ్రలో స్థానికులు, యాత్రికుల భాగస్వామ్యానికి ప్రత్యేక కార్యాచరణ

వర్షాకాలంలో 6 వేల మొక్కల నాటకం.. అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు

నంద్యాల బ్యూరో, జూన్ 2 (ఆంధ్రప్రభ):

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

మంగళవారం శ్రీశైలం పరిపాలన భవనంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తం ఆరు అజెండా అంశాలను పరిశీలించగా, రెండు అంశాలకు ఆమోదం లభించింది. మరో రెండు అంశాలను వాయిదా వేయగా, రెండు అంశాలను తిరస్కరించారు. మిగిలిన 21 అజెండా అంశాలను ఈ నెల 11న జరగనున్న తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

సమావేశంలో అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో స్థానికులతో పాటు యాత్రికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా రానున్న వర్షాకాలంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. వర్షాకాలం ముగిసేలోపు క్షేత్ర పరిధిలో కనీసం 5 వేల నుంచి 6 వేల వరకు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా వృక్షాలను కూడా నాటాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ, తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అలాగే కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని సూచించింది.

పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చాలని సభ్యులు సూచించగా, దత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చెల్లించే నెలవారీ పారితోషికాన్ని పెంచాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply