20 లక్షలు దాటిన జనగణన నమోదు..

20 లక్షలు దాటిన జనగణన నమోదు..

లక్ష్యానికి చేరువలో కర్నూలు జిల్లా!

జిల్లాలో జోరుగా జనగణన ప్రక్రియ

21.67 లక్షల లక్ష్య సాధన దిశగా అధికార యంత్రాంగం వేగవంతమైన చర్యలు

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాలో జనగణన నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటింటా సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేయడంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, హ్యాబిటేషన్లలో సర్వే బృందాలు తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, విద్య, నివాస పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తున్నాయి. ప్రజలు కూడా అధికారులకు సహకరించి సరైన వివరాలు అందించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

2011 జనగణన ప్రకారం కర్నూలు జిల్లా జనాభా 17,78,415 కాగా, తాజా నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 20,15,423 మంది వివరాలు సేకరించినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అంచనా జనాభా 21,67,518గా ఉండటంతో లక్ష్యానికి చేరువలోనే జనగణన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మండలాల వారీగా పరిశీలిస్తే కౌతాళం మండలంలో అత్యధికంగా 91,468 మంది వివరాలు నమోదు కాగా, కోసిగి మండలంలో 85,341 మంది, మంత్రాలయం మండలంలో 72,012 మంది, నందవరం మండలంలో 69,085 మంది, సీ.బెళగల్ మండలంలో 65,231 మంది వివరాలు నమోదయ్యాయి. ఇతర మండలాల్లో కూడా నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రెవెన్యూ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎవరూ మిగలకుండా వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రతిరోజూ నమోదు అవుతున్న వివరాలను సమీక్షిస్తూ పురోగతిని పరిశీలిస్తున్నారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆధార్, కుటుంబ వివరాలు, నివాస సమాచారం వంటి అంశాలను సమగ్రంగా నమోదు చేసి, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడే డేటాబేస్‌ను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జనగణన సిబ్బందికి ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని, సరైన సమాచారాన్ని అందించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరితగతిన నమోదు పూర్తి చేసి నిర్దేశిత గడువులో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Leave a Reply