కదిరి యువ వైద్యుడి అరుదైన ఘనత..

కదిరి యువ వైద్యుడి అరుదైన ఘనత..

ఆర్థోపెడిక్స్‌లో రాష్ట్ర టాపర్‌గా స్వర్ణ పతకం!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: వైద్య రంగంలో కదిరి పట్టణానికి చెందిన ప్రముఖ స్పైన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అజహరుద్దీన్ గద్వాల్ అరుదైన ఘనత సాధించారు. ఎంఎస్ (ఆర్థోపెడిక్స్) విభాగంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ గౌరవాన్ని స్వీకరించారు.

కదిరి పట్టణానికి చెందిన రిటైర్డ్ జువాలజీ లెక్చరర్ గద్వాల్ నిజాముద్దీన్ కుమారుడైన డాక్టర్ అజహరుద్దీన్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. కదిరిలోని శ్రీ శారదా విద్యానికేతన్‌లో పదో తరగతి, విజయవాడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం నంద్యాలలోని శాంతిరామ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

వైద్య విద్యపై ఉన్న ఆసక్తితో నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ పూర్తి చేసి విశ్వవిద్యాలయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు.

పీజీ విద్య అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించిన డాక్టర్ అజహరుద్దీన్ నిరుపేద రోగులకు అంకితభావంతో వైద్యం అందించి మంచి పేరు సంపాదించారు. ఆయన సేవలను గుర్తించిన అధికారులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఉత్తమ సీనియర్ రెసిడెంట్’ అవార్డుతో సత్కరించారు.

వెన్నెముక శస్త్రచికిత్సల్లో మరింత నైపుణ్యం సాధించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆధ్వర్యంలో మల్లికా స్పైన్ సెంటర్‌లో స్పైన్ సర్జరీ ఫెలోషిప్ పూర్తి చేశారు. ఫెలోషిప్ సమయంలో పూణేలో జరిగిన జాతీయ స్థాయి అసికాన్ (ASSICON) సదస్సులో పాల్గొని తన వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సదస్సులో ఆయన సమర్పించిన వీడియో ప్రజెంటేషన్‌కు ‘బెస్ట్ వీడియో ప్రజెంటేషన్’ అవార్డు లభించడం విశేషం.

ప్రస్తుతం అనంతపురంలో సేవలందిస్తున్న డాక్టర్ అజహరుద్దీన్, కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ఆధునిక వెన్నెముక, ఎముకల వైద్య సేవలను రాయలసీమ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. సంక్లిష్ట ప్రమాద గాయాలు, ట్రామా కేసులు, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పులు, మోకాళ్ల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు అందిస్తూ రోగుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, తాను సాధించిన ఈ విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే కారణమని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో అనంతపురం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకం అందుకున్న డాక్టర్ అజహరుద్దీన్ గద్వాల్‌ను కదిరి, అనంతపురం జిల్లాలకు చెందిన వైద్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, స్థానికులు అభినందిస్తూ ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.