KCR Living Legend | తెలంగాణను నిలబెట్టిన నాయకుడు: కేటీఆర్

KCR Living Legend | తెలంగాణను నిలబెట్టిన నాయకుడు: కేటీఆర్
KCR Living Legend | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: కేసీఆర్ ఒక లివింగ్ లెజెండ్ అని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహానేత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అంత సులభం కాదని, అందరినీ ఒప్పించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ అని ఆయన గుర్తుచేశారు.
కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు 24 గంటల విద్యుత్ అందిందని కేటీఆర్ అన్నారు. రైతులకు భరోసాగా నిలిచిన రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆరే అని చెప్పారు. అన్నదాతకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు సాయాన్ని నాలుగు సార్లు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాట తప్పిందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగులు, రైతులు, ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. సెక్యూరిటీ లేకుండా సీఎం తన సొంత ప్రాంతానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. పట్టపగలే పాఠశాలల వద్ద హత్యలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
