జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌కు ఊతం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్‌కు ఊతం..

సానుకూల హామీలతో ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు!

నిజామాబాద్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధాన డిమాండ్‌తో మంగళవారం నగర జర్నలిస్టులు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించినట్లు వెల్లడించారు.

అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి ఇళ్ల స్థలాల అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేని పరిస్థితుల్లో కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల లభ్యతను పరిశీలించాలని ఆర్డీవోకు ఎమ్మెల్యే సూచించినట్లు చెప్పారు.

జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూల దృక్పథంతో స్పందించి, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున, నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply