12 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం…

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం

విశాఖ రైల్వే జోన్ సాకారం
కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో ఘనంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే కల సాకారం కావడం గర్వకారణం

ఇచ్చాపురం, ఆంధ్రప్రభ: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన రైల్వే జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు భావోద్వేగంతో మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 సంవత్సరాలుగా తాను సాగించిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌లో అనేకసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించానని, ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో ప్రజాప్రతినిధిగా దీక్షలు కూడా చేపట్టానని తెలిపారు.

అనాడు ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిగా, నేడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఆ కల సాకారం కావడం తన జీవితంలో మరపురాని ఘట్టమని అన్నారు. ఈ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని వెల్లడించారు.

నూతన జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయని, పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని చెప్పారు. తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు కూడా ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధన కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, జిల్లా వ్యాప్తంగా రూ.3,300 కోట్ల వ్యయంతో 50కి పైగా రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చాపురం ప్రాంతానికి కూడా కీలకమైన ఆర్‌ఓబీ మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇచ్చాపురం వంతెన సమస్యకు కూటమి ప్రభుత్వ హయాంలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పూరి–అహ్మదాబాద్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన మంత్రి, భవిష్యత్తులో ఆ రైలు సేవలు నేరుగా ఇచ్చాపురం నుంచే ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

రూ.400 కోట్లతో ప్రధాన కార్యాలయం

విశాఖపట్నంలో 54 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతమైన ఏఎస్‌పేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు.

తదుపరి ఇచ్చాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. పలువురు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.