31stMaychintana | నిశ్శబ్దం నుంచి పుట్టే నిజమైన సృజనాత్మకత

31stMaychintana | నిశ్శబ్దం నుంచి పుట్టే నిజమైన సృజనాత్మకత
31stMaychintana | సృజనాత్మకతలో దైవత్వపు వాటా
ఆత్మ సౌందర్యాన్ని వ్యక్తం చేసే సృజనాత్మకత
భావాలకు వృద్ధాప్యం రాకూడదు
సృజనాత్మకత మనసును యవ్వనంగా ఉంచే చైతన్య శక్తి
31stMaychintana | ‘సృజనాత్మకత (క్రియేటివిటీ) అంటే పరమాత్మ తన వేణువు ద్వారా పలికించే గానం వంటిది. మనం కేవలం ఆ వేణువులా శూన్యంగా మారాలి.’ మనం చేసే పనిని కేవలం లాభం కోసం కాకుండా, ఒక ఆరాధనలా చేసినప్పుడు ప్రతి కొత్త ఆలోచన ఒక ఆధ్యాత్మిక కృత్యమే. మనలోని ప్రతి భావనను లోక కల్యాణం కోసం ఉపయోగించడమే నిజమైన ఆధ్యాత్మికత.
ప్రతి మనిషిలోనూ ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ విశ్వమే ఒక మహాకావ్యం. శ్రీ పరమాత్మ ఒక గొప్ప సృష్టికర్త. ఆయన అంశ ప్రతి జీవిలోనూ ఉంది. కాబట్టి, మనిషిలో ఉన్న సృజనాత్మక శక్తి ఆ దైవత్వపు వాటానే. మనం ఒక కొత్త విషయాన్ని సృష్టించినప్పుడు, మనలోని దైవిక గుణాన్ని మనం ఆవిష్కరిస్తున్నామని అర్థం. ఒక కొత్త ఆలోచన చేసినా, ఒక కవిత రాసినా, లేదా ఒక బొమ్మ గీసినా మనలోని దైవిక శక్తిని మనం బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టే లెక్క.
సృజనాత్మక ప్రక్రియలో నిమగ్నమైనప్పుడు కాలం తెలియదు, లోకం గుర్తుండదు. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో ‘సమాధి స్థితి’ లేదా ‘ధ్యానం’ అనవచ్చు. ఒక చిత్రకారుడు తన చిత్రంలో లీనమైనప్పుడు, అక్కడ ‘నేను’ అనే అహంకారం నశించి, కేవలం ‘సృష్టి’ మాత్రమే మిగులుతుంది. ఈ స్థితిలో మనిషి తన అంతరాత్మకు అత్యంత చేరువగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి తనను తాను మర్చిపోయి, ఒక పనిలో పూర్తిగా లీనమైపోతాడో, అప్పుడు ఆత్మ తనంతట తానుగా ప్రవహిస్తుంది. గాయకుడు తన్మయత్వంతో పాడుతున్నప్పుడు లేదా ఒక శిల్పి ఏకాగ్రతతో శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు, అక్కడ వారు ఒక ‘మాధ్యమం’ మాత్రమే. ఆ సమయంలో వారి ద్వారా వ్యక్తమయ్యేదే ఆత్మ సౌందర్యం.
సాధారణంగా సృజనాత్మకత అంటే ఏదో ఒక కొత్త వస్తువును తయారు చేయడం లేదా ఒక కళాఖండాన్ని సృష్టించడం అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, సృజనాత్మకత అనేది కేవలం మెదడుకు సంబంధించిన పని కాదు. అది ఆత్మ యొక్క వ్యక్తీకరణ. మనిషిని యంత్రం నుండి వేరు చేసే అద్భుత శక్తి సృజనాత్మకత. ఇది కేవలం కళాకారులకు మాత్రమే పరిమితం కాదు. గృహిణి వడ్డించే వంటలో, రైతు సాగు చేసే పద్ధతిలో, శాస్త్రవేత్త చేసే ప్రయోగంలో… ఎక్కడైతే ప్రేమ, శ్రద్ధ ఉంటాయో అక్కడ సృజనాత్మకత పరిమళిస్తుంది. మనలోని సృజనాత్మకతను వెలికితీయడమే మనల్ని మనం తెలుసుకోవడానికి ఉన్న సులువైన మార్గం.

కాలంతో పాటు శరీరం వృద్ధాప్యానికి లోనుకావడం ప్రకృతి సహజం. కానీ మన ఆలోచనలు, భావాలు ఎప్పుడూ నవయవ్వనంగా ఉండాలి. భావాలకు వృద్ధాప్యం రాకూడదు అంటే, మనలోని ఉత్సాహం, జిజ్ఞాస మరియు కొత్తదనాన్ని స్వీకరించే గుణం ఎప్పటికీ తగ్గకూడదని అర్థం. వయసు పెరిగే కొద్దీ ‘నాకు అన్నీ తెలుసు’ అనే భావన రావడం భావాల వృద్ధాప్యానికి సంకేతం. కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మెదడు, మనస్సు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటాయి.
కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపనే మనసును యవ్వనంగా ఉంచుతుంది. ప్రపంచం మారుతున్న కొద్దీ పాత పద్ధతులకే అతుక్కుపోకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలను మార్చుకోవడం చాలా అవసరం. ‘మా కాలంలో ఇలా ఉండేది కాదు’ అని బాధపడటం కంటే, ‘ఈ కాలంలో ఇది బాగుంది’ అని ఆస్వాదించడం నేర్చుకోవాలి. కళలు, సాహిత్యం లేదా ఏదైనా సృజనాత్మక పనిలో నిమగ్నమైనప్పుడు మన భావాలకు ముసలితనం రాదు. ఒక కవికి లేదా ఒక కళాకారుడికి లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. మనలోని ‘పిల్లవాడిని’ ఎప్పుడూ బతికించుకోవాలి.
నిరాశ, నిస్పృహలు త్వరగా వృద్ధులను చేస్తాయి. రేపటి మీద ఆశ, చేసే పని మీద నమ్మకం ఉన్నంత కాలం మనసులో ముడతలు పడవు. అనుభవాల ద్వారా వచ్చే పరిణతి ఉండాలి కానీ, అది ఉత్సాహాన్ని చంపేసేలా ఉండకూడదు. మన దేహం ఒక ఇల్లు అయితే, మన భావాలు అందులో ప్రవహించే స్వచ్ఛమైన గాలి వంటివి. గాలి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటేనే ఆ ఇల్లు తాజాగా ఉంటుంది. శారీరక వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. మన ఆలోచనల్లో పదును, భావాల్లో సృజనాత్మకత ఉన్నంత కాలం మనం నిత్య యవ్వనులమే!
సృజనాత్మకత అనేది కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదు, అది మన మనసును ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచే ఒక చైతన్య శక్తి. కొత్తగా ఏదైనా ఆలోచించడం, రాయడం లేదా సృష్టించడం మొదలుపెట్టినప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా మనలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తుంది. ఏదో ఒకటి సృష్టించాలనే తపన ఉన్నవారికి లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. ఆ కుతూహలమే వారిని మానసికంగా ఎప్పుడూ ‘యవ్వనంలో’ ఉంచుతుంది. మన భావాలను అక్షర రూపంలోనో, కళా రూపంలోనో వ్యక్తపరిచినప్పుడు కలిగే ఆ తృప్తి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
నిజమైన సృజనాత్మకత గందరగోళం నుండి రాదు. అది నిశ్శబ్దం నుండి పుడుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు స్ఫురిస్తాయి. ధ్యానం ద్వారా మనం మనసులోని చెత్తను తొలగిస్తే, ఖాళీ అయిన ఆ ప్రదేశంలో సృజనాత్మకత అనే అమృతం నిండుతుంది. సృజనాత్మకత అనేది మనిషిని జంతువు కంటే ఉన్నతునిగా, దైవానికి సన్నిహితునిగా చేస్తుంది. బాహ్య వస్తువుల మీద కాకుండా, మన ఆంతరంగికత మీద దృష్టి సారించినప్పుడు సృజనాత్మకత ఒక ‘యోగం’లా మారి, ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్
8008577834
