బాలికలలో నాయకత్వ లక్షణాలు అవసరం..

- స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకత్వంగా వ్యవహరించాలి..
- కిషోర బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తాం..
- జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : బాలికలకు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో మహిళా వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘స్నేహ కిషోర బాలికలు’ నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా.. మే 25 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన మహిళా వారోత్సవాలు శనివారంతో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ కిషోర బాలికల సంఘాల ప్రతినిధుల మాక్ పార్లమెంట్, అవగాహన సదస్సు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినుల ప్రతిభను ప్రశంసిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డిఆర్డిఏ అధికారులను అభినందించారు.
అలరించిన మాక్ పార్లమెంట్
ప్రజావాణి సమావేశ మందిరమంతా విద్యార్థినుల ఉత్సాహభరిత ప్రసంగాలు, చర్చలతో నిజమైన పార్లమెంటరీ వాతావరణాన్ని తలపించింది. ఈ మాక్ పార్లమెంట్‌లో బాలికలు వివిధ రాజ్యాంగ పదవులను స్వయంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాష్ట్రపతిగా జ్ఞానేశ్వరి బాధ్యతలు స్వీకరించగా, లోక్‌సభ స్పీకర్‌గా యమున సభను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రిగా నందిని ప్రభుత్వ పక్ష చర్చలను ముందుండి నడిపించగా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా నిఖిత ప్రభుత్వ విధానాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు. డిప్యూటీ స్పీకర్‌గా ప్రియాంక సభా నియమాలను పాటింపజేస్తూ చర్చలను సమన్వయం చేశారు.
అలాగే వివిధ శాఖల మంత్రుల పాత్రల్లో ఇతర స్నేహ కిషోర బాలికలు పాల్గొని, హోమ్, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. ప్రతి అంశంపై విద్యార్థినులు తమ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేయడం విశేషంగా నిలిచింది. సభలో ప్రశ్నోత్తరాల సెషన్‌లో కూడా వారు చురుకుగా పాల్గొని సమస్యలకు పరిష్కార సూచనలు ప్రతిపాదించారు.
భవిష్యత్ నాయకత్వానికి బలమైన పునాది
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. మహిళా వారోత్సవాల ప్రధాన లక్ష్యం బాలికల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వారిలో స్వీయ అవగాహన కల్పించడమేనని తెలిపారు. బాలికలు చిన్న వయస్సులోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం భవిష్యత్ నాయకత్వానికి బలమైన పునాది అవుతుందన్నారు.
బాలికలు తమ వాక్చాతుర్యంతో నిర్భయంగా మాట్లాడటానికి ఒక వేదిక అవసరమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారానే వారిలో సృజనాత్మకత, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. స్నేహ కిషోర బాలికల సంఘాల ద్వారా విద్యార్థినులు సామాజిక సమస్యలను గుర్తించి వాటిపై చర్చించడం, నిర్ణయాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. మాక్ పార్లమెంట్ వంటి వేదికలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలపై అవగాహనను పెంపొందిస్తాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బాలికలు విద్యలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. కుటుంబం, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని గుర్తుచేశారు.
కిషోర బాలికలకు సైకిళ్ల పంపిణీ
దూరప్రాంతాలకు బస్సులు లేకపోవడం వల్ల తాము చదువుకు దూరం అవుతున్నామని కొంతమంది బాలికలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిషోర బాలికలకు త్వరలోనే సైకిళ్లను అందజేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, అదనపు పీడీ రాజేశ్వరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


