Mahesh Kumar Goud | చేనేత రుణమాఫీకి చొరవ చూపుతాం…

Mahesh Kumar Goud | చేనేత రుణమాఫీకి చొరవ చూపుతాం…
- సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా వాటిపై ఉన్న రుణభారాన్ని తొలగించేందుకు తమ ప్రభుత్వం వైపు నుంచి సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపుతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల బృందం ఆయనను, అలాగే ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, రాబోయే సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని వారికి సవివరంగా వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాలపై సుమారు రూ.35 కోట్ల మేర రుణభారం పేరుకుపోయిందని, దీనివల్ల సంఘాల నిర్వహణ భారంగా మారిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత రంగానికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డికి త్వరలోనే లేఖ…
చేనేత సహకార సంఘాల ప్రతినిధుల బృందం వినతిపై సానుకూలంగా స్పందించిన ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్.. ఈ అంశాలను పార్టీ అధిష్ఠానం, ప్రభుత్వ ఉన్నత నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. చేనేత సహకార సంఘాల రుణమాఫీతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు.
సమస్యల తీవ్రతను వివరిస్తూ తక్షణమే సీఎంకు లేఖను కూడా ఫార్వర్డ్ చేస్తానని ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. తమ వినతిపై తక్షణమే స్పందించి హామీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్‌కు చేనేత సంఘాల ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల గౌరవ అధ్యక్షులు భారత వాసుదేవ్, ఉమ్మడి నల్గొండ జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు అప్పం రామేశ్వరం, కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్, పలివెల మాజీ సంఘ అధ్యక్షులు చెరుకు భిక్షపతి, పలివెల మాజీ సర్పంచ్ చెరుకు జనార్దన్ సహా పలు సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
