పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన భట్టి విక్రమార్క

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిలబెట్టుకున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరితాండాలో ఆదివారం జీవనోపాధి కోసం అవసరమైన పరికరాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ.4.53 లక్షల విలువైన మెషినరీ పరికరాలు, మట్టికొరకు రూ.2 లక్షల చెక్కును బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడకముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. కుమ్మరితాండాలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువచ్చామని, గ్రామానికి 20 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు ప్రశ్నించాలని, గత పదేళ్లలో వారు ఏమి చేశారో చెప్పాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పులిమడుగు సర్పంచ్ దత్తారం రాథోడ్, బీసీ వెల్ఫేర్ అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply