Pawan Kalyan Visits : చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి Andhra Prabha Top News

Pawan Kalyan Visits : చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి Andhra Prabha Top News
- పవన్ కళ్యాణ్ దృష్టి
- జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శన
- గోదావరి కాలుష్య నివారణకు
- కొత్త మార్గాల అన్వేషణ
- ఇండోర్ మోడల్‌లో చెత్త వేరు పై అధ్యయనం
- రాష్ట్రంలో మరో ఆరు ప్లాంట్లకు ప్రోత్సాహం
- డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ లక్ష్యం
- 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్‌షాపులకు సన్నాహాలు
ఆంధ్రప్రభ, పల్నాడు ప్రతినిధి

‘చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు.
Pawan Kalyan Visits : ఆసాంతం ఆసక్తిగా..

చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు..? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంటు అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్తు తయారీ ఎలా జరుగుతుందో, చివరికి బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు క్షుణ్నంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్లాంటు పరిశీలన తర్వాత పూర్తి వివరాలను, ఆంధ్రప్రదేశ్ కు చెత్త సేకరణ విషయంలో ఉన్న అవకాశాలను డిప్యటీ సీఎంకు జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు ఆపరేషన్స్ హెడ్ ఎం.వి.చారి వివరించారు. ఆయన దీనిపై ప్రత్యేకంగా ఓ నివేదిక తయారు చేశానని చెప్పడంతో పూర్తి ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రత్యేక సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయించారు. ఈ సందర్భంగా ప్లాంటు మొత్తం తిరుగుతూ కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Pawan Kalyan Visits : మరో ఆరు ప్లాంట్లు పెడదాం

“రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. కొండవీడు జిందాల్ ప్లాంటు సామర్థ్యం రోజువారీ 1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి, సగటున 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. దాన్ని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేసి, రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చగలదు. విశాఖపట్నంలోనూ జిందాల్ ప్లాంటు ఉత్తరాంధ్ర రీజియన్ చెత్తను సేకరించి 15 మెగావాట్లు విద్యుత్తు ఉత్పాదన చేస్తోంది. ఈ తరహా ప్లాంట్లు రాష్ట్రంలో త్వరలో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిలో కాకినాడలో ఇప్పటికే పనులు మొదలు కాగా, నెల్లూరు, కడప కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది.
Pawan Kalyan Visits : బయో ప్లాంట్లూ అవసరం

బయో మిథలైజేషన్ ప్లాంట్ల నుంచి బయో గ్యాస్ కూడా ఉత్తత్తి చేయవచ్చు. పూలు, పండ్లు, కూరగాయాలు, ఆహార వ్యర్థాలను ఉపయోగించి, క్రమపద్ధతిలో వేరు చేసి దాని ద్వారా గ్యాస్ ఉత్తత్పి చేయవచ్చు. అయితే చెత్త సేకరణ అనేది, దానిని వేరు చేయడం అనే దానిపై కసరత్తు జరగాలి. చెత్తను వేరు చేయడం, వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవడం ప్రధానం. ప్రజల్లో దీనిపై అవగాహన రావాలి.
Pawan Kalyan Visits : కాలుష్యరహిత పుష్కరాలఏ లక్ష్యం

గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది. గోదావరి నదిలో కలుస్తున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా చిత్తశుద్ధితో ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా చెత్త నిర్వహణను పక్కాగా చేసేందుకు జిందాల్ అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తాం. గోదావరి పుష్కరాలకు సంబంధించి 268 పంచాయతీలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతాయి. ఈ పంచాయతీల్లో చెత్త నిర్వహణ అనేది చాలా కీలకం. నదిలోకి వ్యర్థాలను విడుదల చేయకుండా, నదిని అందంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం మీద పంచాయతీల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. అని డిప్యూటీ సీఎం అన్నారు.
Pawan Kalyan Visits : సింగపూర్ ని స్ఫూర్తి తీసుకుందాం

సింగపూర్ లో వినియోగించే విద్యుత్తులో 2.8 శాతం చెత్త నుంచి ఉత్తత్పి అయ్యేది ఉంటుంది. ఇక్కడ చెత్త సేకరణ విధానం విభిన్నంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చెత్తను సేకరించడం, దాన్ని నిల్వ చేయడం, వినియోగించుకోవడం కొత్త పంథాలో ఉంటాయి. సింగపూర్ టాంజాంగ్ టెర్మినల్ లో చెత్తను వేరు చేసే ప్రక్రియ చాలా పద్ధతిగా జరుగుతుంది. అలాంటిది విశాఖపట్నం పోర్టులో కూడా మొదలుపెట్టేలా ఆలోచిస్తాం. ముఖ్యంగా సింగపూర్ 90 శాతం చెత్తను కాల్చి, దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆ దేశం ఇటు పరిశుభ్రంగానూ, అటు చెత్త ద్వారా విద్యుత్తు ఉత్పత్తిలో అగ్రభాగంలోనూ కొనసాగుతోంది, అపి డిప్యూటీ సీఎం వివరించారు.
Pawan Kalyan Visits : ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

దేశంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరపాలక సంస్థ చెత్త సేకరణ విధానం ఆదర్శం. చెత్తను ప్రజల దగ్గర నుంచి సేకరించి, వినియోగం వరకు స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వచ్ఛభారత్ అవార్డులను వరుసగా గెలుచుకుంది. ఇండోర్ వేస్ట్ మేనే జ్ మెంట్ ట్ మోడల్ రాష్ట్రంలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శం కావాలి. దీనికి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలి. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు రహితంగా తీర్చిదిద్దాలంటే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు మరిన్ని అవసరం. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ప్లాంటు ఉండటం ద్వారా ఆయా నగరపాలక, మున్సిపాలిటీల చెత్తతో పాటు చుట్టుపక్కలున్న గ్రామ పంచాయతీల ద్వారా సేకరించే చెత్తను కూడా సులభంగా సేకరించే వీలుంటుంది. ఫలితంగా దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తితో పాటు వివిధ రకాలైన ఇతర అవసరాలు తీరుతాయి. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి తయారీ ప్లాంట్లలో ఒక మెగావాట్ విద్యుత్తు తయారీ కి అవసరం అయ్యే ప్లాంటు నిర్మాణానికి రూ.25 కోట్లు మేర ఖర్చు అవుతుంది. అలాగే ఒక మెగావాట్ విద్యుత్తు తయారీకి సగటున 2.5 టన్నుల చెత్త అవసరం అవుతుంది. ఒక మెగావాట్ విద్యుత్తు తయారీకి 4.5 టన్నుల స్టీమ్ అవసరం అవుతుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
Pawan Kalyan Visits : అవగాహన కల్పించాలి

పంచాయతీల్లో చెత్త నిర్వహణకు సంబంధించి క్లస్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. ప్లాంట్లకు చెత్త ఎలా అవసరం అవుతుంది..? దాన్ని ఎలా వేరు చేయాలి..? సేకరించిన చెత్త ద్వారా పంచాయతీలు ఆదాయం ఎలా పొందవచ్చనే అంశాలను, డంపింగ్ యార్డ్ లు లేని పంచాయతీలను సాకారం చేసేందుకు వర్క్ షాపులను నిర్వహించేలా చూడాలి’ అని స్పష్టం చేశారు.
ALSO READ : History Survey : నల్లమలలో హిస్టరీ సర్వే Andhra Prabha Top News
