కూటమిని విడగొట్టేందుకే కుట్రలు..

కూటమిని విడగొట్టేందుకే కుట్రలు..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనుక రాజకీయ కుట్ర..
తెలంగాణ నేతల హెచ్చరికలకు భయపడేది లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్

భీమవరం, ఆంధ్రప్రభ : ఏపీలో అత్యంత పటిష్టంగా ఉన్న కూటమిని విడగొట్టాలనే దురాలోచనతోనే తెలంగాణ వేదికగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆరోపించారు.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు చేస్తున్న హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భీమవరం పర్యటనలో ఉన్న ఆయన శనివారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.

ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు కుట్రలు చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ఏపీలో ఉన్న కూటమిని ఎలాగైనా విడగొట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ముగిసిన అంశాలను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ నేతలు ఈ వ్యవహారంపై పునరాలోచన చేయాలని, లేకపోతే రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాలే కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply