విద్యాభివృద్ధికి రథసారథులు వారే..

విద్యాభివృద్ధికి రథసారథులు వారే..
- అధికారుల కీలక దిశానిర్దేశం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యాభివృద్ధికి రథసారథులని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద అన్నారు.
శనివారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా 2026 మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
గిరిజన విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రతి పాఠశాలకు అభివృద్ధి ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

విద్యాభివృద్ధికి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అనే నాలుగు ప్రధాన స్తంభాలు ఆధారమని వివరించారు. వీటిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధాన భూమిక పోషిస్తారని, స్పష్టమైన లక్ష్యాలతో విద్యా నాణ్యతను పెంపొందించవచ్చని తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో విద్యార్థులకు ఆనందదాయకమైన అభ్యాస వాతావరణాన్ని కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే ‘బడిబాట’ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 3 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని రోజువారీ ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని ప్రాజెక్టు అధికారి సూచించారు. ప్రతి గిరిజన గ్రామంలో ఐదు సంవత్సరాలు నిండిన బాలబాలికలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బడిబాట కార్యక్రమ నిర్వహణ కోసం ఏటీడీవోలు డివిజన్ వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఆశ్రమోన్నత పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి సంసిద్ధతలో భాగంగా రోజువారీ పరిశుభ్రత కార్యక్రమాల పట్టికను ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీడీలు అంబాజీ జాదవ్, రమాదేవి, డిప్యూటీ డీఈఓ గోడం చందన్, డీపీఓ ఆదిలాబాద్, ఏపీవో (పీవీటీజీ) భాస్కర్, ఉమ్మడి జిల్లాల ఐటీడీవోలు, ఏసీఎంవోలు, జేసీడీవోలు, ప్రధానోపాధ్యాయులు, ఎస్సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
