కాలనీలో సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని మధుర నగర్ 9వ వార్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నీటి నిల్వ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలనీలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నీటి నిల్వల కారణంగా ఏర్పడుతున్న అసౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న లోపాలపై అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మధుర నగర్‌లో వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని, కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

