భద్రతకు కొత్త కవచం… ముస్తాబాద్‌లో ప్రత్యేక ప్రారంభం

ముస్తాబాద్, ఆంధ్రప్రభ : గ్రామాలు సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతకు మరింత భరోసా ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. శనివారం ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాలను అరికట్టడంతోపాటు నేరాలకు పాల్పడిన నిందితులను త్వరితగతిన గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ ముందంజలో సాగుతోందని తెలిపారు. సీసీ కెమెరాలు, డిజిటల్ నిఘా వ్యవస్థలు, ఆధునిక దర్యాప్తు పద్ధతుల ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలు, వ్యాపారస్థులు, ప్రజాప్రతినిధులు స్వచ్చందగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.

తద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతిభద్రతలు మరింత బలోపేతమవుతాయన్నారు. ముస్తాబద్ మండలంతోపాటు గ్రామాల్లో స్వచ్చందగా ముందుకు వచ్చి 101 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గణేష్, ప్రజాప్రతినిధులు, సన్ రైస్ సీసీ కెమెరాల కంపెనీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply