AP Speed of Business | పెట్టుబడుల గ్రౌండింగ్‌కు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

AP Speed of Business | పెట్టుబడుల గ్రౌండింగ్‌కు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

AP Speed of Business | పరిశ్రమల అనుమతులకు జీవో 119తో కీలక మార్పులు
ఎస్‌ఎల్‌ఏ దాటితే డీమ్డ్ అప్రూవల్ అవకాశం
అనుమతుల పెండింగ్‌పై ఆరు స్థాయిల్లో సమీక్ష

AP Speed of Business | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీతో గతంలో పెట్టుబడులను ఆకర్షించిన ప్రభుత్వం, పెట్టుబడులను మరింత వేగంగా గ్రౌండింగ్ చేసేందుకు మరిన్ని హంగులను అద్దుతోంది. ఏపీలో పరిశ్రమలు పెట్టే వారికి గేమ్‌చేంజర్‌గా గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీకి సరికొత్త మార్పులు తీసుకువస్తూ శుక్రవారం జీవో నెంబర్ 119ని విడుదల చేసింది. ఏపీ స్పీడ్ ఆఫ్ బిజినెస్ దిశగా సాగుతోంది.

గతంలో సింగిల్ డెస్క్ పోర్టల్‌లో దరఖాస్తు చేసినా కాంపిటెంట్ అథారిటీలు సమయానికి క్లియరెన్స్‌లు ఇవ్వకపోవడం వల్ల పరిశ్రమలు పెట్టేవారు పలు ఇబ్బందులు పడేవారు. అధికారులు నిర్ణీత సమయంలో అనుమతులు ఇవ్వకపోయినా, ఎస్‌ఎల్‌ఏ దాటినా ఆటోమేటిక్ అప్రూవల్స్ రావట్లేదు. ఇలాంటి వాటిపై జిల్లా, రాష్ట్రస్థాయిలో నిరంతర మానిటరింగ్ వ్యవస్థ లేదు.

కొత్త జీవోలో నాలుగు మార్పులు

ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ-2015లో ముఖ్యమైన నాలుగు మార్పులను కొత్తగా వచ్చిన జీవోలో తీసుకువచ్చారు. గతంలో సింగిల్ డెస్క్ బ్యూరో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లకు డీమ్డ్ అప్రూవల్ పవర్ లేదు. తాజా జీవోలో ఎస్‌ఎల్‌ఏ దాటితే బ్యూరోనే డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేస్తుంది. కాంపిటెంట్ అథారిటీ సంతకం అవసరం లేదు.

ఏపీలో స్పీడ్ ఆఫ్ బిజినెస్

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం
• పాలసీ-2015కి కీలక సవరణలు
• పరిశ్రమలు పెట్టేవారికి వేగవంతంగా అనుమతులు
• అనుమతుల్లో ఇబ్బందులు లేకుండా ఆరు స్థాయిల్లో ఆరా
• ప్రతి వారం రివ్యూ, రెండు వారాలకు పరిశ్రమల శాఖ కమిషనర్ సమీక్ష
• నెలకు ఒకసారి పరిశ్రమల సెక్రటరీ, రెండు నెలలకు ఒకసారి మంత్రి మానిటరింగ్
• మూడు నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణ
• ప్రతి ఆరు నెలలకు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

దీనివల్ల ఫైర్ ఎన్ఓసీ, ఫ్యాక్టరీ లైసెన్స్, పొల్యూషన్ బోర్డు అనుమతి వంటివి 21 రోజుల్లో రాకపోతే బ్యూరో ఆటో అప్రూవల్ ఇస్తుంది. గతంలో పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అర్జీలపై రివ్యూ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఆరు దశల్లో సమీక్ష చేసే వ్యవస్థను ఫిక్స్ చేశారు. కింది స్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి వరకు సమీక్ష చేస్తారు. ఏ దశలో ఆగినా వారు తప్పించుకోలేరు.

పాత జీవోలో డీఐపీసీకి సరైన పవర్స్ లేవు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే డీపీఐసీ డైరెక్ట్‌గా పెండింగ్ క్లియర్ చేస్తుంది. పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అనుమతులు ఇవ్వడంలో పరిశ్రమల శాఖ బ్యూరో మీటింగ్‌పై క్లారిటీ లేదు. దీంతో నెలల తరబడి అర్జీలు పెండింగ్‌లో ఉండేవి. కొత్త జీవోలో ప్రతి వారం అంటూ గడువును ఫిక్స్ చేశారు. పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయంలో మీటింగ్ పెడతారు. దరఖాస్తుదారులు ఫిజికల్‌గా, వర్చువల్‌గా హాజరుకావచ్చు. దీనివల్ల ప్రతి ఏడు రోజులకు ఒకసారి అర్జీపై సమీక్ష జరుగుతుంది.

అనుమతులకు ఆరు స్థాయిల్లో ఆరా

పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతుల కోసం వచ్చే అర్జీలపై సమీక్షా మెకానిజంను బలోపేతం చేశారు. అనుమతి నుంచి గ్రౌండింగ్ వరకు ప్రతి దశను ఆరు స్థాయిల్లో సమీక్ష చేస్తారు. ఆ మేరకు కొత్త జీవోలో టైమ్ టేబుల్‌ను విధించారు.

ప్రతి వారం బ్యూరో లెవల్‌లో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సమీక్షిస్తారు. అన్ని విభాగాల ఎస్‌పీఓసీలు ఫిజికల్‌గా, వర్చువల్‌గా హాజరుకావాలి. ప్రతి రెండు వారాలకు బ్యూరో చైర్మన్ లెవల్‌లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సమీక్షిస్తారు.

ఎందుకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని సహేతుక కారణాలతో ఎస్‌పీఓసీలు సమాధానం ఇవ్వాలి. నెలకు ఒకసారి పరిశ్రమల శాఖ కార్యదర్శి అన్ని హెచ్ఓడీలతో సమీక్షిస్తారు. రెండు నెలలకు ఒకసారి పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశానికి కార్యదర్శి, హెచ్ఓడీలు హాజరై పెండింగ్‌లపై వివరణ ఇవ్వాలి.

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) చైర్మన్ హోదాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని విభాగాల కార్యదర్శులతో రివ్యూ చేస్తారు. ఈ ఐదు దశల్లో కూడా పెండింగ్ ఉంటే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష చేసి అన్ని అనుమతులు మంజూరు చేసేలా చొరవ చూపనున్నారు.

Leave a Reply