Article21 | సెక్స్ వర్కర్లుగా మారడం.. నేరం కాదు

Article21 | సెక్స్ వర్కర్లుగా మారడం.. నేరం కాదు

Article21 | వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను గౌర‌వించాలి
వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి
తీర్పుల ఆల‌స్యంపైనా సుప్రీంలో విచార‌ణ‌
వాద‌న‌లు ముగిసిన మూడు నెల‌ల్లోపూ తీర్పు ఇవ్వాల‌ని ఆదేశం
హైకోర్టుల‌లో జ‌రుగుతున్న ఆల‌స్యంపై ఆగ్ర‌హం
బెయిల్ తీర్పులు ఒక్క రోజులోనే జ‌డ్జిమెంట్
స్వచ్ఛందంగా ప్రాస్టిట్యూషన్‌ను చేసే వారిని వేధించ‌వ‌ద్దు
మాన‌వ అక్ర‌మ ర‌వాణపై సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల
పోలీసులు, మీడియాకు కీల‌క సూచ‌న‌లు చేసిన న్యాయ‌స్థానం

Article21 | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి (సెక్స్ వర్కర్లుగా మారుతున్న వారు)ని ఎంచుకున్న వయోజనులకు, బలవంతంగా ఈ రొంపిలోకి లాగిన బాధితులకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని, కేవలం లైంగిక వృత్తిలో ఉన్నార‌నే కారణంతో ఏ తల్లి నుంచైనా ఆమె బిడ్డను బలవంతంగా వేరు చేయలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

పోలీసులకు కఠిన ఆదేశాలు.. మీడియాకు హెచ్చరికలు
తన వ్యక్తిగత కారణాలతో సొంతంగా, ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వారిని అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే.. రెస్క్యూ ఆపరేషన్లు లేదా దాడులు నిర్వహించే సమయంలో సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం.. వారి గుర్తింపును వెల్లడించడం తీవ్రమైన నేరమని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నవారిని వదిలిపెట్టి.. మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది.

ఆధార్ కార్డుల జారీకి స్పష్టమైన ఆదేశం
సెక్స్ వర్కర్లకు ఇతర వ్యక్తుల తరహాలోనే సమాన చట్టపరమైన రక్షణ కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నివాస ధ్రువీకరణ పత్రాలు (అడ్రస్ ప్రూఫ్) లేకపోయినప్పటికీ, సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులను జారీ చేయాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీని ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు ఇతర వ్యక్తుల తరహాలోనే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందే అవకాశం లభిస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

తీర్పులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
హైకోర్టులలో విచారణలు పూర్తయిన తర్వాత తీర్పుల ప్రకటనలో జరుగుతున్న ఆలస్యాన్ని (తీర్పు రిజర్వ్) నివారించడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పుల ప్రకటనలో ఆలస్యం కావడం వల్ల పిటిషనర్లకు చాలా నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలలో సకాలంలో తీర్పులు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను సాధారణంగా 3 నెలల లోపే వెల్లడించాలని ఆదేశించింది. బెయిల్ విషయాలలో ఆర్డర్లను అదే రోజు ప్రకటించడానికి ప్రయత్నాలు జరగాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ తీర్పు ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లయితే, వాటిని మరుసటి రోజుకల్లా డెలివరీ చేసి, సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.

click here to read

click here to read more

Leave a Reply