రెండు పడకగదుల ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

రెండు పడకగదుల ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

  • కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : రెండు పడకగదుల ఇళ్ల సముదాయాల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల సముదాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని, మౌలిక సదుపాయాల ఏర్పాటును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండు పడకగదుల ఇళ్లకు సంబంధించిన మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా పంపిణీ చేసేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్ల సముదాయాల్లో మిగిలి ఉన్న పెండింగ్ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి, లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ పరిశీలనలో గూడూరు సర్పంచ్ వనజ, కమలాపూర్ సర్పంచ్ సతీష్, జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఆర్‌డీఓ మేన్ శ్రీను, ఎంపీడీవో బాబు, తహసీల్దార్ సురేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply