ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహం

ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహం

  • ఫసల్వాదిలో ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి, ఆంధ్రప్రభ:

సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రకటించారు. గురువారం ఆశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విగ్రహం వివరాలను వెల్లడించారు.

ఈ నందీశ్వర విగ్రహం 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు , 19 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనుంది. దీని నిర్మాణానికి ఉపయోగించనున్న భారీ రాయి బరువు సుమారు 684 టన్నులు ఉంటుందని తెలిపారు. ఈ విగ్రహం కోసం అవసరమైన రాయిని కంది మండలం ఎర్థనూర్ శివారులోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో సేకరించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్న నంది విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిందని, అయితే ఫసల్వాదిలో ఏర్పాటు చేయనున్న నందీశ్వర విగ్రహం దానికంటే ఎత్తు, బరువులో అధికంగా ఉండటం విశేషమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రత్యేక భారీ వాహనం ద్వారా ఈ భారీ రాయిని ఊరేగింపుగా ఆశ్రమానికి తరలించనున్నట్లు తెలిపారు.

విద్యాపీఠం మీడియా ఇన్‌చార్జి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం జరగడం ఆనందకరమని, ఇందులో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. అనంతరం వారు నందీశ్వర విగ్రహ ప్రతిమ నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply