చివరి గింజ వరకు ధాన్యం కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు

చివరి గింజ వరకు ధాన్యం కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు
- మంత్రుల స్పష్టీకరణ
యాదాద్రి, ఆంధ్రప్రభ:
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రులు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు సందర్శించారు. అనంతరం రామాజిపేట వద్ద గల ప్రభుత్వ గోదాములను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, మాది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినా, మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రబీ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ. 11 వేల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. రబీ సీజన్‌లో ఇంతటి భారీ దిగుబడి రావడం, ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
రాజకీయాల కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రులు విమర్శించారు. “ప్రతిపక్షాల ఉచ్చులో రైతాంగం చిక్కొద్దు” అని వారు సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం మద్దతు ధర ప్రకటించడానికే పరిమితమైందని, రాష్ట్రాలకు సరైన సహకారం అందించడం లేదని ఆరోపించారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇందుకోసం అదనంగా రూ. 16,470 కోట్ల రూపాయలను వెచ్చించామని గుర్తు చేశారు. గతంలో రైతులకు సంకెళ్లు వేసిన వారే, నేడు రైతుల గురించి మాట్లాడుతున్నారని మంత్రులు ఎద్దేవా చేశారు.
అధికారులకు కీలక ఆదేశాలు
హమాలీల కొరత నేపథ్యంలో ధాన్యం తరలింపునకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తదుపరి నాలుగు, ఐదు రోజుల పాటు లారీలు, ఇతర వాహనాలను ధాన్యం కొనుగోలు, తరలింపు పనులకే వినియోగించాలని సూచించారు. రుతుపవనాలు రాకముందే ధాన్యాన్ని మిల్లులకు చేర్చాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

