పీఎం లంకలో పనులపై ప్రత్యేక దృష్టి..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పీఎం లంకలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎం లంకలో చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. స్వామి వివేకానంద మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే మత్స్యకారులకు అవసరమైన బోట్లు, వలలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి జాబితా సిద్ధం చేయాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు.

అలాగే, గ్రామంలోని కొంతమంది లబ్ధిదారులకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, ఇంకా అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి కూడా సోలార్ రూఫ్‌టాప్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పీఎం లంక జెడ్పీ హైస్కూల్‌కు డయాస్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో రెండు రోడ్ల నిర్మాణం, అంగన్వాడి సెంటర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పిస్తే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, డిపిఓ వై.దోసిరెడ్డి, మత్స్యశాఖ ఏడీ ఎల్.ఎల్.ఎన్.రాజు, విద్యుత్ శాఖ అధికారులు, తహసిల్దార్, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply