Telangana education news | ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం

Telangana education news | ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం
Telangana education news | 2,769 పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ అమలు
మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల స్పందన
Telangana education news | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ అయిన ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించనుంది.
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,769 ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ సెక్షన్లను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు రీజియన్లుగా విభజన
మొత్తం 2,769 పాఠశాలలను రెండు విభాగాలుగా విభజించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. క్యూర్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణ ప్రాంత పరిధిలో 529 పాఠశాలలు ఉన్నాయి. ఇక నాన్-క్యూర్ రీజియన్ పరిధి అయిన ఇతర జిల్లాల్లోని 2,240 పాఠశాలల్లో ఈ ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 275 సెక్షన్లు, నల్గొండలో 124, భద్రాద్రి కొత్తగూడెంలో 118 సెక్షన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు
ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించే ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున నిధులను కేటాయించింది. ఈ నిధులతో తరగతి గదులకు చిన్నపాటి మరమ్మతులు చేయడం, చిన్న పిల్లలకు అనువైన ఫర్నిచర్ కొనుగోలు, ఇండోర్, అవుట్‌డోర్ ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు పెయింట్ వేయించాలని విద్యాశాఖ ఆదేశించింది. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శిశు-స్నేహపూర్వక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కూడా కల్పించనున్నారు.
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం
ఈ సెక్షన్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లను, ఆయాలను గౌరవ వేతనంతో నియమించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టనున్నాయి. ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరడానికి అర్హత ఉన్న వయస్సు గల పిల్లలందరినీ ఈ ప్రీ-ప్రైమరీ సెక్షన్లలో చేర్చుకోవచ్చు.
బోధన పూర్తిగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళిక ప్రకారం సాగుతుంది. చిన్నపిల్లలకు చదువు భారం కాకుండా, ఆటపాటలతో కూడిన కృత్యాధార బోధనను అందించనున్నారు. ఎంఈఓలు, డీఈఓలు నిరంతరం ఈ తరగతుల నిర్వహణను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి పిల్లలకు బాల్యం నుంచే నాణ్యమైన పునాది విద్య అందుతుందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రీ-ప్రైమరీ తరగతులు ఒకేసారి ప్రారంభించాలి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకే విడతలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల ప్రాథమిక పాఠశాలలు ఉంటే, ప్రభుత్వం కొన్ని పాఠశాలలకే అనుమతులు ఇస్తూ కాలయాపన చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి బుధవారం విమర్శించారు.
2026-27 విద్యా సంవత్సరానికి 2,769 పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. దీనివల్ల ఇంకా 12 వేల పాఠశాలల్లో ప్రవేశాలు లేక ఆయా పాఠశాలలు బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ-ప్రైమరీ పిల్లలకు బోధించేందుకు సుశిక్షితులైన ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
