Hyderabad police alert | హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు

Hyderabad police alert | హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు
Hyderabad police alert | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బక్రీద్ పండుగ నేపథ్యంలో గోరెలు, మేకల విక్రయదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డిజిటల్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని గోరెలు, మేకల సంతల్లో కొనుగోలుదారుల రద్దీ పెరుగుతున్న వేళ కొందరు కేటుగాళ్లు నకిలీ పేమెంట్ యాప్‌లతో వ్యాపారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
“స్కాన్ ఫోన్ పే” పేరుతో నకిలీ మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగిస్తూ నగదు చెల్లించినట్లు ఫోన్ స్క్రీన్‌లపై నకిలీ రసీదులు చూపించి గోరెలు, మేకలను తీసుకెళ్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సంతల్లో ఉండే హడావుడిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అయ్యిందో లేదో నిర్ధారించుకోకుండానే జీవాలను అప్పగిస్తుండటంతో మోసపోతున్నారు.
ఇటీవల కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి రెండు భారీ మోసాలు నమోదయ్యాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ముగ్గురు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఓ వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ.68 వేల విలువైన గోరెలను నకిలీ యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు చూపించి తీసుకెళ్లారు. అలాగే రాజేంద్రనగర్‌లో మరో నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన గోరెలను ఇదే తరహా నకిలీ పేమెంట్ యాప్‌తో మోసం చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన బాధితులు డబ్బు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో గోరెలు, మేకల విక్రయదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఫోన్‌లో కనిపించే “పేమెంట్ సక్సెస్” స్క్రీన్‌షాట్లు లేదా నకిలీ సందేశాలను నమ్మవద్దని, తప్పనిసరిగా తమ బ్యాంక్ అధికారిక ఎస్ఎంఎస్ లేదా బ్యాంకింగ్ యాప్ ద్వారా డబ్బు జమ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. పెద్ద మొత్తాల లావాదేవీల సమయంలో నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం మరింత సురక్షితమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా మోసం చేసే ప్రయత్నాలు జరిగినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
