ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

  • యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, క్రాంతి కుమార్

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, పి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. భీమవరం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, జిల్లా ఖజానా శాఖ అధికారికి ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో విడత పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గడిచిన విద్యా సంవత్సరంలో జరిపిన నెలవారీ ఎస్ఎంసి మీటింగ్ల వివరాలు , తీర్మానాలు ఫోటోలు 24 గంటల్లో అప్లోడ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో వేసవి సెలవులు మొత్తం ప్రతిరోజు విద్యాశాఖ కార్యక్రమాల అమలులో నిమగ్నులై ఉన్నారని, గడిచిపోయిన ఆ ఫోటోల వివరాలు అప్లోడ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు.

జూన్ నెలలో నిర్వహించబోయే ట్రైనింగ్ షెడ్యూల్ ను వాతావరణ పరిస్థితులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలన్నారి. పదవ తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ను వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ బిల్లులు ఏలూరుకు పంపడంలో ఏలూరు నుండి వచ్చిన మెడికల్ బిల్లులను ప్రొసీడింగ్ ఇచ్చి డిస్పాచ్ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలన్నారు. దీనిపై స్పందించిన డిఈఓ నారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవీ రామానుజరావు, జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ పట్టాభిరామయ్య, సహాధ్యక్షులు కే రాజశేఖర్, నాయకులు కే త్రిమూర్తులు, బిఆర్ఎంకే స్వామి, బి నాగబాబు, కే మల్లేశ్వర రావు, జీడీ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply