రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట, ఆంధ్రప్రభ:

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నేరుగా కొనుగోలు కేంద్రానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం తూకం, నిల్వ, తరలింపు ప్రక్రియలపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, అవసరమైన సూచనలు చేశారు. రైతులు ధాన్యం విక్రయంలో ఇబ్బందులు పడకుండా గన్నీ సంచులు, టార్పాలిన్లు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ట్యాబ్ ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేసి బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply