ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచాలి..

ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచాలి..
ఇంటి వద్దే పెన్షన్ పంపిణీపై దృష్టి: కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి అత్యంత కీలకమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల వద్ద విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు.
మంగళవారం నంద్యాలలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డీఎల్‌డీఓలు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ మండల అధికారులతో పెన్షన్ పంపిణీ విధానం, ప్రజల అభిప్రాయ సేకరణ, పారదర్శక సేవల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డబ్ల్యూఎంఏ పీడీ సూర్యనారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాభాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవల అమలుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పెన్షన్ పంపిణీ విధానంపై ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాలోని 4 వేలకుపైగా పంపిణీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు, ఫోటోలు రాష్ట్ర కార్యాలయానికి పంపాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
జిల్లాలో 2 లక్షల 16 వేల మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల సుమారు రూ.98 కోట్ల మేర పెన్షన్లు అందుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.3,500 కోట్ల వ్యయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సేవల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
పెన్షన్ పంపిణీపై నిర్వహించే సర్వేల్లో “ఇంటి వద్దకే పెన్షన్ అందించారా?”, “అధికారుల ప్రవర్తన ఎలా ఉంది?”, “లంచం లేదా అదనపు డబ్బులు అడిగారా?” వంటి ప్రశ్నలు ఉంటాయని వివరించారు. ప్రతి లబ్ధిదారునికి ఇంటి వద్దనే, 300 మీటర్ల పరిధిలో పంపిణీ జరగాలని, ప్రతి పంపిణీకి జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ఆదేశించారు.
ఒకేచోటకు ప్రజలను పిలిచి పంపిణీ చేయడం వల్ల ప్రతికూల స్పందన వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి సోమవారం సీఎం స్థాయిలో, ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ స్థాయిలో పర్సెప్షన్ సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
చెత్త సేకరణ, తాగునీటి నాణ్యత, వీధి దీపాల నిర్వహణపై కూడా ప్రజల ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. వారానికి కనీసం రెండు సార్లు చెత్త సేకరణ, తాగునీటి నాణ్యత, వీధి దీపాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు సంతృప్తి స్థాయి తగ్గితే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లేనని, వాటిని సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పర్సెప్షన్ విధానాన్ని ఒత్తిడిగా కాకుండా మెరుగుదల సాధనంగా చూడాలని సూచించారు.
