ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు

ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మహిళా శక్తికి దిశానిర్దేశం : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ప్రతి కార్యకర్తకు మహానాడు కార్యక్రమాన్ని చేరువ చేస్తున్నామని, టీడీపీ శ్రేణులు మహానాడును విజయవంతం చేయాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈనెల 27, 28 తేదీల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 11 క్లస్టర్లలో మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మహానాడు ప్రజల ఆశయాలకు ప్రతిబింబంగా కొనసాగుతోందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు కాలం నుంచే మహానాడు వేదికగా ప్రజా సమస్యలపై చర్చించి యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కీలక తీర్మానాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడటం టీడీపీ సంప్రదాయమన్నారు. ఈసారి రాష్ట్ర, దేశ పరిస్థితులు, ఇంధన పొదుపు చర్యలను దృష్టిలో పెట్టుకుని మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించడం రాజకీయ చరిత్రలో వినూత్న కార్యక్రమమన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు, జూమ్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రసార సదుపాయాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు మహానాడు ప్రత్యక్ష అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పింఛన్లను రూ.4 వేలుకు పెంచడం, తల్లికి వందనం పథకం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈసారి మహానాడులో మహిళా శక్తి ప్రధాన అంశంగా ఉండబోతోందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు చేపడుతున్నామని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీలో పార్క్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మహానాడు నిర్వహించే వేదికల వివరాలను కూడా వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
