యడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన..

యడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన..
పారిశ్రామికాభివృద్ధిపై నేతల వ్యాఖ్యలు
యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు ఎంఎస్ఎంఈ పార్క్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు వరమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వర్చువల్‌గా నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. 2017లోనే ఈ పార్క్‌కు బీజం పడిందని, తాను మంత్రిగా ఉన్నప్పుడు భూ కేటాయింపులు జరిగాయని తెలిపారు. అటవీ శాఖ, కేంద్ర అనుమతుల జాప్యంతో ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.
యడ్లపాడు పార్క్‌లో స్పేస్, డిఫెన్స్, ఫుడ్, ఆయుర్వేద రంగాలకు చెందిన యూనిట్లకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. పార్క్‌లో లభించే ఉపాధిలో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధితోనే జిల్లా, రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యమని అన్నారు. యడ్లపాడు, స్పైసెస్ ఎంఎస్ఎంఈ పార్కులను వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో 4 నుంచి 5 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
చిలకలూరిపేటలో టెక్స్‌టైల్ పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతోందని, అదే తరహాలో ఇతర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు విస్తరించాలన్నారు. మంచి రోడ్డు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు.
కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా ఎంఎస్ఎంఈ మేనేజర్ సురేష్, తహసీల్దార్ అనురాధ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
