అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా

అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా

  • ఎమ్మెల్యే కూన రవికుమార్

ఆమదాలవలస, ఆంధ్రప్రభ:
ఆముదాలవలస నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని జగ్గు శాస్త్రుల పేట వద్ద రూ.3 కోట్ల 82 లక్షల భారీ వ్యయంతో నిర్మించబోయే నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి (సబ్‌స్టేషన్) శుక్రవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ (PUC) చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.

లో-వోల్టేజ్ సమస్యలకు చెక్:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ఆముదాలవలస నియోజకవర్గంలో చాలా కాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అవసరాలు, మరియు గృహ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిసర ప్రాంతాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్ సమస్యలు, అప్రకటిత విద్యుత్ అంతరాయాలు పూర్తిగా తొలగిపోయి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని స్పష్టం చేశారు.

మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కట్టుబాటు:
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ వేగంతో సమన్వయం చేసుకుంటూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు స్థానికంగా పరిశ్రమల స్థాపనకు, తద్వారా యువతకు ఉపాధి లభించడానికి దోహదపడుతుందని అన్నారు. ఆముదాలవలస ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన ప్రతి అంశంలోనూ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ నూతన 33/11 కేవీ విద్యుత్ కేంద్రం ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలతో పాటు సమీప గ్రామాలకు స్థిరమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందనుంది.

భారీగా తరలివచ్చిన కూటమి నేతలు:
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, ఇతర కూటమి ముఖ్య నాయకులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, కూటమి పార్టీల కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply