గొడుగు భూములపై కబ్జా యత్నం..?

గొడుగు భూములపై కబ్జా యత్నం..?
-ఎంపీ, అధికార పార్టీ నేతలపై దేవినేని అవినాష్ తీవ్ర ఆరోపణలు
-విజయవాడ ఉత్సవాల పేరుతో దేవాలయ స్థలాల దోపిడీ ప్రయత్నమంటూ విమర్శలు
-కోర్టు ఆదేశాలు వచ్చినా స్థలం ఖాళీ చేయలేదని మండిపాటు
-భూముల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది
ఆంధ్రప్రభ, విజయవాడ
విజయవాడలోని గొడుగు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. విజయవాడ ఉత్సవాల పేరుతో దేవాలయ స్థలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు సహా ఏడుగురు ఎమ్మెల్యేల దృష్టి అభివృద్ధిపై కాకుండా దోపిడీ రాజకీయాలపైనే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలను నిర్వహించి గొడుగు వెంకటేశ్వర స్వామి భూమిని ఆక్రమించాలనే ప్రణాళిక రచించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్‌కు చెందిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించగా, ఉత్సవాలు ముగిసిన 56 రోజుల తర్వాత స్థలాన్ని ఖాళీ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే నవంబర్‌లో గడువు ముగిసినా ఇప్పటికీ స్థలం ఖాళీ చేయకపోవడం వెనుక అధికార అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఇండోమెంట్ అధికారులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ స్థలం దేవాలయానికి చెందిందని బోర్డులు ఏర్పాటు చేయాలి” అని అవినాష్ డిమాండ్ చేశారు. ఎంపీకి విజయవాడ అభివృద్ధిపై ఆసక్తి లేదని, దేవాలయ భూములను దోచుకోవడంపైనే పట్టుదలగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ పేర్లు ఉపయోగించి భూములపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ధార్మిక సంస్థ పేరుతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విజయవాడ ఉత్సవాల సమయంలో పనిచేసిన స్థానిక బీజేపీ నేతలకు ఇప్పటికీ చెల్లింపులు చేయలేదని కూడా ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, దేవాలయ ఆస్తులను రక్షించాలని ఆయన కోరారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కబ్జాలు, దోపిడీలతో ముందుకు సాగుతున్నారని ఆరోపించిన అవినాష్, దేవాలయ భూముల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది” అని స్పష్టం చేశారు.
