వెజ్ బిర్యానీలో చికెన్..

స్విగ్గీకి షాక్
. ఫుడ్ డెలివరీ తప్పిదం.. ఎండీకి నాన్‌బెయిలబుల్ వారెంట్
. వినియోగదారుల కమిషన్ కఠిన చర్య
. కర్నూలులో సంచలనం సృష్టించిన ఫుడ్ డెలివరీ కేసు
. ఆన్‌లైన్ ఆర్డర్ గందరగోళం.. కోర్టు ఆగ్రహం
. వినియోగదారుల ఫోరమ్ ఆదేశాల అమలు చేయకపోవడంతో కఠిన చర్య.
. కర్నూలు ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.
కర్నూలు బ్యూరో, మే 22, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల్లో నిర్లక్ష్యం వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, గడువు ముగిసిన ఆహారం సరఫరా చేయడం వంటి ఫిర్యాదులు తరచూ వెలుగుచూస్తున్న వేళ కర్నూలులో చోటుచేసుకున్న ఓ ఘటన సంచలనంగా మారింది. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు రావడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా, ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ప్రతినిధులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడం చర్చనీయాంశమైంది.
కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబరులో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా ఆన్‌లైన్‌లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. స్థానిక న్యూ అప్సరా హోటల్ నుంచి డెలివరీ బాయ్ ఆహారం తీసుకొచ్చి ఇవ్వగా, అందులో చికెన్ ముక్కలు ఉండటం చూసి బాధితుడు షాక్‌కు గురయ్యాడు.
తాను పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటానని, ఈ ఘటన వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొంటూ బాధితుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడు, యాప్ నిర్వాహకులు, హోటల్ ప్రతినిధుల వాదనలు విన్న కమిషన్ గతేడాది డిసెంబర్ 31న కీలక తీర్పు వెలువరించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది.
అయితే కమిషన్ ఆదేశాలను సంబంధిత యాప్ నిర్వాహకులు అమలు చేయకపోవడంతో వ్యవహారం మరింత ముదిరింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదు. తాజాగా మే 21న వ్యక్తిగతంగా హాజరుకావాలని మరోసారి ఆదేశించినా ఎవరూ కమిషన్ ఎదుట హాజరు కాలేదు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా వినియోగదారుల కమిషన్ బెంగళూరులోని స్విగ్గీ సంస్థ ఎండీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే న్యూ అప్సరా హోటల్ మేనేజర్‌తో పాటు పలువురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
ఈ ఘటనతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నిర్లక్ష్యంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో కమిషన్ కఠిన వైఖరి అవలంబించడం గమనార్హం.
