సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం

సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం

  • జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:
పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (STPs) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఎస్‌టీపీల నిర్మాణం, భూసేకరణ పురోగతిపై ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాము నాయక్, నందికొట్కూరు, ఆత్మకూరు మండలాల తహశీల్దార్లు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 704లో గల రెండు ఎకరాల భూమి సేకరణకు సంబంధించి సదరు రైతు పూర్తి సమ్మతి తెలిపినందున, ఆ భూమికి సంబంధించిన నష్టపరిహార ప్రతిపాదనలను తదుపరి ఆమోద ప్రక్రియ కోసం ఉన్నతాధికారులకు తక్షణమే పంపాలని ఆదేశించారు. అలాగే, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 759లో సుమారు 1.50 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి, భూమిని ఇచ్చే రైతుతో సావధానంగా చర్చలు జరపాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నష్టపరిహార ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పట్టణాల్లో శాశ్వత పారిశుధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణ మరియు ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఎస్‌టీపీల నిర్మాణాలు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎక్కడా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా, రైతుల పూర్తి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ పనుల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply